
వ్యక్తిగత సమాచారాన్ని సోషల్మీడియాలో పంచుకోవద్దు
టెక్నాలజీతో ప్రయోజనాలతోపాటు ప్రమాదాలూ ఉన్నాయి
విద్యార్థుల అవగాహన సదస్సులో డీసీపీ పూజ, ఏసీపీ స్నేహ
ఖమ్మం రూరల్, అక్టోబర్ 7: అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఇంజారపు పూజ, వైరా ఏసీపీ స్నేహమెహ్రా సూచించారు. సైబర్ నేరాలు, ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ అంశాలపై పెద్దతండా ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోజనాలతోపాటు ప్రమాదాలూ పొంచి ఉన్నాయని అన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సెల్ఫోన్లలో, సోషల్మీడియాలో నిక్షిప్తం చేయొద్దని సూచించారు. స్నేహితులకు, బంధువులకు కూడా చెప్పకూడదన్నారు. దీని వల్ల అనేక కష్టనష్టాలు వచ్చే ప్రమాదం లేకపోలేదని వివరించారు. ఫోన్ నెంబర్, ఏటీఎం పిన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మెయిల్ ఐడీ పాస్వర్డ్ వంటివి కూడా సోషల్ మీడియాలో పెట్టొద్దని సూచించారు. సైబర్ మోసాల అనుమానాలు ఉంటే 155260 అనే జాతీయ హెల్ప్ లైన్ నెంబరుకు, ఇంకా ఏదైనా ప్రమాదాలు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ రమణ, సీఐ తుమ్మ గోపి, సైబర్ సెల్ ఎస్సై రంజిత్ పాల్గొన్నారు.