
తొలగించాలని సుభాష్‌నగర్ బస్తీ వాసుల విజ్ఞప్తి
జీడిమెట్ల, జనవరి 7 : కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్‌లోని ఓపెన్ నాలాపై ఉన్న ఇరువైపులా స్థలాలను ఆక్రమించి నిర్మిస్తున్న అక్రమ కట్టాడాలపై చర్యలు తీసుకోవాలని సుభాష్‌నగర్ బస్తీ వాసులు కోరుతున్నారు. గంపల బస్తీ నుంచి జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ ఒపెన్ నాలా వరకు ఉన్న సుమారు 1600 మీటర్లున్న నాలాకు ఇరువైపులా ఆక్రమించి కొంత మంది అక్రమ కట్టడాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎగువ జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు ఉండడంతో వర్షాలు విస్తారంగా కురిస్తే వరద నీరు వీధుల్లోకి చేరి ఇంట్లోకి చేరుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుభాష్‌నగర్ నాలాను రూ.9 కోట్లతో పునఃనిర్మాణం చేపట్టిన నాలాలు ఆక్రమణకు గురై కుచించుకపోవడంతో వరద నీటి సమస్య తలెత్తుతున్నదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాలాలను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సుభాష్‌నగర్ బస్తీ వాసులు కోరుతున్నారు.
అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం ..
సుభాష్‌నగర్ నాలాకు ఇరువైపుల చేపడుతున్న అక్రమ నిర్మాణాల విషయమై కుత్బుల్లాపూర్ సర్కిల్ పట్టణ విభాగం అధికారి సంతోష్‌కుమార్‌ను వివరణ కోరగా సంఘటనా స్థలానికి సిబ్బందిని పంపించి కట్టడాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమకట్టడాలపై ఉన్నతాధికారులకు నివేదికను పంపించి రెండు రోజుల్లో కూల్చివేస్తామని తెలిపారు.