యాసంగిలో 20 శాతానికి పైనే ఇతర పంటలకు అవకాశం
వేరుశనగ, పెసర, శనగ తదితర పంటలకు ప్రాధాన్యం
అవగాహన కల్పించిన వ్యవసాయశాఖ అధికారులు
సూర్యాపేట, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : వరితో వర్రీ పడే కంటే పంట మార్పిడి చేసి మార్కెట్లో డిమాండ్ ఉండే పంటల వైపు రైతులు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాసంగిలో 20 నుంచి 30 శాతం వరి ప్రత్యామ్నాయ పంటలను రైతులనుప్రోత్సహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ రైతుల్లో అవగాహన కల్పించిన విషయం విదితమే. దీంతో ఈ సారి యాసంగిలో ఆరు తడి పంటలైన వేరుశనగ, పెసర, మంచిశనగ తదితర పంటల వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు.
నదులు నీళ్లు పుష్కలంగా పారుతుండడంతో పాటు విస్తారంగా వర్షాలు పడడంతోబావులు, బోర్లు, చెరువులు జలకళతో రైతాంగం అత్యధికంగా వరి సాగుకే మొగ్గు చూపుతున్నది. ఏడాదిలో రెండు సీజన్లలో వరిదే అగ్రభాగం కావడంతో ధాన్యం నిల్వలతో గోదాములు నిండుతున్నాయి. మరో పక్క కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థ ఎఫ్‌సీఐ బియ్యం సేకరణకు కొర్రీలు పెట్టడం తాజాగా అసలే ధాన్యం కొనలేమని కేంద్రం చేతులెత్తేసింది. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. అలాగే యాసంగి సాగు… రైతులు వేసే పంటలపై ఇప్పటికే మార్కెట్లో బాగా డిమాండ్ ఉండే పంటల సాగు కోసం ప్రభుత్వం ప్రణాళికా బద్ధ్దంగా అడుగులు వేస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న మూడు జోన్లలో వరి స్థానంలో సాగు చేసే పంటలను ప్రభుత్వం సూచించింది. వ్యవసాయశాఖ రాష్ర్టాన్ని ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణగా మూడు వ్యవసాయ జోన్లను విభజించింది. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా అయి న సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాలు దక్షిణ తెలంగాణ జోన్లో ఉంది. ఈ జోన్లో వరికి ప్రత్యామ్నాయంగా 20 నుంచి 30 శాతం ఇతర పంటలను సాగు చేయించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ మేరకు అమలు చేసేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గత నెల 24 నుంచి 30 వరకు వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, దిగుబడులు, వాటికి ఆశించే చీడపీడలు, సాగు ఖర్చులు, విత్తనాలు, మార్కెటింగ్ తదితర అంశాలను రైతులకు అవగాహన కల్పించారు.
80వేల ఎకరాల్లో లక్ష్యం..
గతేడాది జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా అందులో 20 శాతం పంట మార్పిడి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన ఉండగా ఈ మేరకు దాదాపు 80వేల ఎకరాల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు కావాల్సి ఉంది. జిల్లాలో మూడు నదుల నుంచి పుష్కలంగా నీళ్లు పారుతుండడంతో పాటు విస్తారంగా వర్షాలు పడడంతో భూమిపైనే నీళ్లు ఉన్నాయి. దీంతో ఇతర పంటల సాగుకు అవకాశం తక్కువ ఉండగా నదీ జలాలు రాని మెట్ట ప్రాంతాల్లో మాత్రమే ఆరుతడి పంటలకు అవకాశం ఉంటుందని పలువురు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల అవగాహనతో వరి వేయాలనుకునే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతుండడంతో 80వేల ఎకరాల లక్షం అధిగమించకపోయినా 40 నుంచి 50 వేల ఎకరాల్లో ఇతర పంటలైన వేరుశనగ, పెసర, మంచిశనగ, పత్తి, మిర్చి తదితర వాణిజ్య పంటలు సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అవగాహనతో ఆలోచన మారుతున్నది
ఇటీవల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పల్లెలు పర్యటించి రైతులకు అవగాహన కల్పించడంతో వారి ఆలోచనలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనదంటూ ప్రతి నిత్యం మీడియాలో వస్తున్న వార్తలు తెలుసుకుంటుండడంతో పాటు అధికారులు ప్రత్యామ్నాయ పంటల వల్ల కలిగే లాభాలను వివరించడంతో తేడాది యాసంగిలో వరి సాగు చేసిన రైతులు ఇప్పటికే కొంతమేర అయినా పంట మార్పిడి చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
మార్పు కచ్చితంగా ఉంటుంది
తమ శాఖ ఆధ్వర్యంలో గత నెలలో గ్రామాలు పర్యటించి ప్రత్యామ్నాయ పంటల వల్ల జరిగే లాభాలు. అంతా వరి వేయడం వల్ల మార్కెట్లో వచ్చే ఇబ్బందులు, నష్టాలపై వివరించడంతో చాలా మంది రైతులు పంట మార్పిడికి సుముఖంగా ఉన్నారు. వరి కంటే ఆరుతడులతో పండే వాణిజ్య పంటలకు మంచి డిమాండ్‌తో పాటు సాగు సులభతరంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, భూముల తీరును బట్టి రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.
-రామారావునాయక్, డీఏఓ, సూర్యాపేట జిల్లా