ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్లు
రామగిరి, అక్టోబర్ 6: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సంబంధిత అధికారులు పూర్తి చేశారు. బుధవారం ఆయా ప్రాంతాలతోపాటు ఎంజీయూను జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, వి.చంద్రశేఖర్ వీసీ ప్రొ.సీహెచ్. గోపాల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. వారి వెంట ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తాసీల్దార్ నాగార్జునరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎంజీయూ అధికారులున్నారు. గవర్నర్ ఉదయం 10:45గంటలకు ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంటారు. 11.05గంటలకు ప్రైవేటు దవాఖానను, 11:35గంటలకు రెడ్‌క్రాస్ భవనంలో రెండో అంతస్తును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:20గంటలకు పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఒంటి గంటలకు ఆర్ట్స్బ్లాక్లో పాలకమండలితో సమావేశం నిర్వహించి భోజనం అనంతరం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.