
రోజురోజుకూ పెరుగుతున్న ధరలు
ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణంతో పుష్కలంగా సాగునీరు
గతంలో కంటే రెట్టింపైన సాగు
గుంట జాగ లేకుండా పంటలు పండిస్తున్న రైతన్నలు
వ్యవసాయ భూముల కొనుగోళ్లపై ప్రతి ఒక్కరి దృష్టి
కొనేవారు పెరిగారు.. అమ్మేవారు తగ్గారు..
సిద్దిపేట, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాగు భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణంతో ఉమ్మడి మెదక్ జిల్లా సాగు స్వరూపమే మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో సాగుకు నీరులేక భూములన్నీ బీడుగా మారాయి. గ్రామాల్లో ఉపాధి కరువై అప్పట్లో వలస వెళ్లారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రతి గుంటకూ సాగునీరు అందిస్తుండడంతో బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రైతులు గుంట జాగ లేకుండా పంటలు పండిస్తుండడంతో గతంలో కంటే సాగు విస్తీర్ణం రెట్టింపైంది. ఎటుచూసినా పచ్చని పంటపొలాలే దర్శనమిస్తున్నాయి. దీంతో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా భూముల ధరలు రూ.లక్షల్లో పలుకుతున్నాయి. ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షలకు పైనే భూముల ధరలు పలుకుతున్నాయి. ప్రధాన రహదారులు, హైవేలను ఆనుకుని ఉన్న భూములైతే రూ.60 లక్షలకు పైనే పలుకుతున్నాయి. వ్యవసాయ భూములు కొనేవారి సంఖ్య పెరుగగా, అమ్మేవారు అంతంతగానే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న రైతులు రికార్డుస్థాయిలో పంటలు సాగుచేస్తున్నారు. దీంతో కొనుగోలు చేసేందుకు సాగుభూమి దొరకడం లేదనే చెప్పవచ్చు.
సాగు భూములకు రెక్కలొచ్చాయి. భూముల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నిన్న ఉన్న ధర ఇవ్వాళ ఉండడం లేదు.. రోజురోజుకూ లక్షల్లో ధరలు పెరుగుతుండడంతో రియాల్టర్లకు పండుగ. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతో నాడు పడావున్న భూములు నేడు సాగు భూములుగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఎటు చూసినా పచ్చందాలు కనిపిస్తున్నాయి. ఏటా కొత్తగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఒకప్పుడు సాగుకు నీరులేక వర్షాధార పంటలపై ఆధారపడిన జిల్లా రైతులు ఇప్పుడు బంగారు పంటుల పండిస్తున్నారు. గజం జాగ కూడా ఖాళీగా కనిపించడం లేదు. దీంతో సాగు భుములకు లక్షల్లో ధరలు పలుకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భూములు అమ్మడానికి సైతం ఎవరూ ముందుకు రావడంలేదు. అర ఎకరం భూమి ఉన్నా దానిని బంగారం తునకలా కాపాడుకుంటున్నారు. ఇన్నాళ్లూ ప్లాట్లపై పెట్టుబడులు పెట్టినవాళ్లు నేడు సాగు భూములను కొనుగోలు చేస్తుండడంతో వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు. గతంలో ఎకరాకు రూ.20 లక్షలు పలికిన ధర ప్రస్తుతం ఎకరాకు రూ.25 నుంచి 35 లక్షల పైమాటే. ప్రధాన రహదారుల పక్కన భూముల ధరలు రూ.60 లక్షల పైనే పలుకుతున్నాయి.
సమైక్య రాష్ట్రంలో మెతుకు సీమలో ఒక్క ప్రాజెక్టులు నిర్మించనూ లేదు. గత ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో ఎక్కడికక్కడ పడావు భూములే దర్శనమిచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నిర్మించారు. గోదావరి జలాలతో ఇక్కడి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపడంతో పాటు ఈ యేడాది భారీ వర్షాలుకు కురిశాయి. దీంతో భూ గర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ఈ వానకాలంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 9,55,600 మంది రైతులు 15,75,904 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచే శారు. సిద్దిపేట జిల్లాలో 3,16,019 రైతులు 5,32,827 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా, ఇందులో వరి సాగును 1,78,036 మంది రైతులు 3,12,927 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి పంటను 83,843 మంది రైతులు 1,26,625 ఎకరాల్లో సాగు చేయగా, మిగతా అన్ని రకాల పంటలు సాగు చేశారు. పుష్కలంగా సాగునీరు ఉండడంతో వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. మెదక్ జిల్లాలో 2,35,631 మంది రైతులు 3,30,694 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందులో 1,76,869 మంది రైతులు 2,56,207 ఎకరాల్లో వరి పంట, 35,197 మంది రైతులు 53,102 ఎకరాల్లో పత్తి పంటను, మిగిలినది వివిధ రకాల పంటలను సాగు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 4,03,950 మంది రైతులు 7,12,383 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, ఇందులో 78,808 మంది రైతులు 1,12,138 ఎకరాల్లో వరి పం టను, 1,72,376 మంది రైతులు 3,61,099 ఎకరాల్లో పత్తి పంటను, మిగిలినది ఇతర పంటలను సాగు చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ భూముల ధరలు అమాం తం పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు వచ్చాయి. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లా నలుమూలలా రిజర్వాయర్లు ఉన్నాయి. ఇటీవల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో సాగుకు బాగా కలిసొచ్చింది. పడావు భూములు పంట పొలాలుగా మారాయి. దీంతో భూముల ధరలు పెరిగాయి. ఇదివరకు ఎకరాకు రూ.20 లక్షలు పలికిన ధర ప్రస్తుతం ఎకరాకు రూ.25 నుంచి రూ.35 లక్షల పైమాటే పలుకుతున్నది. దారి సరిగా లేకనో, బండ రాళ్లు ఉన్న భూములైతే రూ.20-25 లక్షల వరకు ధర పలుకుతున్నది. ప్రధాన రహదారుల పక్కన రూ.60 లక్షల పైనే ఉంది. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు, వాటి కాల్వల పక్కన ఎకరం భూమి సుమారుగా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య విలువ చేస్తున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర ఎకరం ధర ఎంత లేదన్న ఎకరాకు రూ.50 లక్షల పైనే పలుకుతున్నది. తపాస్‌పల్లి రిజర్వాయర్ కింద రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉన్నది.
ఎటు చూసినా పచ్చని పంట పొలాలు
ఉమ్మడి మెదక్ జిల్లా పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయి. ఫలితంగా భూములకు డిమాండ్ పెరిగింది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, మెదక్, తుప్రాన్, రామాయంపేట, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, అందోల్ తదితర ప్రాంతాల్లో భూముల ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భూము లు అమ్మేవారు కరువయ్యారు. సాగు భూములు కొనేవారు రోజురోజుకూ ఎక్కువయ్యారు. ప్రతిఒక్కరూ ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉండాలి అని కోరుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణాలు తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల ఫలితమే అని చెప్పాలి.