
డాగ్ స్కాడ్స్‌తో పోలీసుల గాలింపు
ఘటనా స్థలానికి ఎమ్మెల్యేలు కంచర్ల, సుధీర్‌రెడ్డి
నీలగిరి, సెప్టెంబర్ 6 : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమీప బంధువు ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ జయశీల్‌రెడ్డి సోమవారం ఉదయం తన అమ్మమ్మ గ్రామమైన నల్లగొండ మండలం దుప్పలపల్లిలోని వ్యవసాయ క్షేత్రం వద్ద అదృశ్యమయ్యారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన దేవిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సునందల ఏకైక కుమారుడు జయశీల్‌రెడ్డి(42). జమైకాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసి కొంతకాలం ప్రాక్టీస్ చేసి రెండు సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చాడు. యూఎస్‌లో తన సోదరి స్థిరపడడంతో వారి వద్ద ఉండాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. కరోనా కారణంగా వెళ్లడం అలస్యమైంది. దీంతో అతను నల్లగొండతోపాటు బంధువుల ఊర్లకు వెళ్తుండేవాడు. మూడు రోజుల క్రితం నల్లగొండకు వచ్చిన ఆయన సోమవారం డ్రైవర్ మల్లేశ్‌తో కలిసి ఉదయం దర్వేశిపురానికి వెళ్లి దైవ దర్శనం చేసుకొని అమ్మకు చెందిన వ్యవసాయ క్షేత్రానికి వచ్చాడు. రోడ్డుపైనే కారు ఆపి డ్రైవర్‌ను అక్కడే ఉండమని, తాను వాకింగ్ చేసి వస్తానని వ్యవసాయ క్షేత్రంలోని వెళ్లాడు. మేనమామ కోమటిరెడ్డి వినోద్‌రెడ్డితో మాట్లాడాడు. సుమారు 60 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎవరూ లేకపోవడం జయశీల్‌రెడ్డి ఒక్కడే ఉండడం, బయటకు రావడం అలస్యం కావడంతో డ్రైవర్ లోనికి వెళ్లి వెతకగా అచూకీ కనబడలేదు. వెంటనే అతను వారి బంధువులకు సమాచారం అందించారు.
యూఎస్‌కు వెళ్లేందుకు ఇష్టం లేకేనా..?
తన చెల్లెలు యూఎస్‌లో స్థిరపడడంతో అక్కడికి వెళ్లి స్థిరపడాలని తల్లిదండ్రులు సూచించినట్లు సమాచారం. కానీ అక్కడికి వెళ్లడం ఇష్టంలేదని ఇక్కడే ఏదైనా ఆసుపత్రిలో భాగస్వామిగా చేరతానని చెప్పినట్లు బంధువులు పేర్కొన్నారు. గత నెల 4న వెళ్లాల్సి ఉండగా వాయిదా పడగా ఈ నెల 8న వెళ్లేందుకు సిద్ధం చేసుకున్నాడు. యూఎస్‌కు వెళ్లడం ఇష్టం లేక వ్యవసాయ క్షేత్రంలో అత్మహత్య చేసుకున్నాడా? లేక సమయం గడిచి పోవాలని సెల్‌ఫోన్ స్వీచ్ఛాఫ్ చేసి ఇతర ప్రాంతానికి వెళ్లాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రంగంలోకి పోలీస్ బలగాలు
జయశీల్‌రెడ్డి అచూకీ కోసం పోలీసులు బలగాలు రంగంలోకి దిగాయి. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి పోలీస్ బలగాలతో వెతుకుతున్నారు. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి గాలించారు. అగ్నిమాపక బృందాలు, స్పెషల్ పోలీసులు తనిఖీలు చేశారు. వ్యవసాయ క్షేత్రంలో కుంట, బావి ఉండడంతో అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో నీటిని బయటికి తోడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు జాగిలంతో ఆచూకీ కనుక్కొనే ప్రయత్నం చేశారు. అది దుప్పలపల్లి గ్రామంలోకి వెళ్లి రోడ్డుపైకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడిసైదిరెడ్డితో కలిసి అక్కడికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.