
వివరాలు పోలీస్ స్టేషన్లో సమర్పించాలి : ఎస్పీ ఏవీ రంగనాథ్
నీలగిరి, సెప్టెంబర్ 6 : గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు పోలీస్‌శాఖ అనుమతి ఆన్లైన్ ద్వారా ఇవ్వనున్నట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న http://policeportal. tspolice.gov.in వెబ్సైట్లో మండపాల నిర్వాహకులు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ పరిధిలోని అధికారులు వాటిని పరిశీలించి గణేశ్ మండపాల ఏర్పాటుతోపాటు నిమజ్జన అనుమతులు ఆన్లైన్ ద్వారా ఇస్తారని తెలిపారు. గణేశ్ నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిర్వాహకులు పోలీస్‌శాఖ సూచనలు, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. మండపాల నిర్వాహకులు కమిటీ వివరాలు, ఫోన్ నంబర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని పేర్కొన్నారు. గణేశ్ మండపాల వద్ద, నిమజ్జన శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.