
ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి మొత్తం 1001 పోస్టులు నెలాఖరు వరకు భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానను వైద్యవిద్యా కేంద్రంగా మార్చుతున్నారు. ఇది నేటి నుంచి అమలులోకి రానున్నది. ప్రస్తుత జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలోనే 25ఎకరాల స్థలంలో అత్యాధునిక హంగులతో రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ భవనాలను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ఖరారు కాగా, డిజైన్లు రూపొందిస్తున్నారు. డిజైన్లకు సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. తొలి భవనాన్ని రూ.25 కోట్లతో మూడంతస్తుల్లో నిర్మించనున్నారు. ఇందులోనే తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ ఉంటాయి. వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే 500 పడకల దవాఖానతో రోగులకు మెరుగైన వైద్యం అందనుంది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 150 సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించాలని ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉంది. సీఎం కేసీఆర్ స్వయంగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ఎప్పటికప్పడు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) అధికారులకు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. బోధనా సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం గతనెల నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను త్వరలో పూర్తి చేయనుంది. మెడికల్ కాలేజీలోని 34 విభాగాలకు సంబంధించి బోధన, బోధనేతర సిబ్బందిని నియమించనున్నారు. అధికారుల సమాచారం మేరకు మెడికల్ కాలేజీలో బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి మొత్తం 1001 పోస్టులు భర్తీ చేయనున్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్, రిజిస్టార్లను ప్రభు త్వం నెలాఖరులోగా నియమించనుంది. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా జిల్లా కేంద్ర దవాఖానను వైద్యవిద్యా కేంద్రంగా మార్చనున్నారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం (నేటి)నుంచి జిల్లా కేంద్ర దవాఖాన వైద్య విద్యా కేంద్ర దవాఖానగా మారనుంది. మెడికల్ కాలేజీ ప్రారంభించిన అనంతరం జిల్లా కేంద్ర దవాఖాన పూర్తిగా మెడికల్ కాలేజీకి అనుబంధంగా, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో పనిచేయనుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దవాఖానను 500 పడకలకు పెంచడంతో పాటు అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు. వచ్చే ఏడాది జూలై నుంచి మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది. ప్రస్తుత ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలోని 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలో మెడికల్ కాలేజీని నిర్మించనున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.510 కోట్లను కేటాయించింది. ప్రభుత్వ దవాఖానలోని సర్వే నెంబర్లు 268, 269, 556, 558, 582, 590, 591లో ఉన్న 21.11 ఎకరాల భూమిని మెడికల్ కాలేజీ నిర్మా ణానికి రెవెన్యూశాఖ రోడ్లు భవనాల శాఖకు అప్పగించింది.
ఖరారైన కన్సల్టెన్సీ.. సిద్ధమవుతున్న డిజైన్లు..
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఆవరణలోని 25ఎకరాల భూమి లో ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మించనుంది. నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన ఇంజినీరింగ్ కన్సల్టెన్సీని ఖరారు చేసింది. త్వరలోనే కన్సల్టెన్సీ మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ఖరా రు చేయనుంది. కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషర్ వాకాటి కరుణ, డీఎంఈ రమేశ్‌రెడ్డి గతనెలలో పరిశీలించారు. ఆర్అండ్బీ పర్యవేక్షణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం జరగనుంది. 12 లక్షల ఎస్ఎఫ్టీలో మెడికల్ కాలేజీ భవనాలు నిర్మించనున్నారు. అడ్మినిస్ట్రేషన్ భవనం, మెడికల్ కాలేజీ తరగతుల భవనం, స్టాఫ్ క్వార్టర్స్, బాలు రు, బాలికల హాస్టల్స్‌ను నిర్మించనున్నారు. వీటితో పాటు బోధనేతర సిబ్బంది కోసం నాలుగు భవనాలు, మార్చురీ కోసం ఒక భవనం నిర్మిస్తారు. ప్రధానమైన మెడికల్ కాలేజీని 6లక్షల ఎస్ఎఫ్టీలో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన డిజైన్లను ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సిద్ధం చేస్తున్నది. పక్కా వాస్తు ప్రకారం ఈ భవనాలను నిర్మించేలా ఆర్అండ్బీ చర్యలు తీసుకుంటున్నది. డిజైన్లు పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్ వాటిని పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపిన అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
రూ.25 కోట్లతో తొలి భవన నిర్మాణం..
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతులు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతున్నది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిబంధనల మేరకు మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభానికి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియను ప్రభు త్వం ప్రారంభించింది. మెడికల్ కాలేజీ ప్రారంభానికి వీలుగా భవనాల నిర్మాణ పనులను ప్రారంభించనుంది. ప్రస్తుత డీఎంహెచ్‌వో కార్యాలయ భవనాన్ని మెడికల్ కాలేజీ అవసరాల కోసం తీసుకోనున్నారు. దీనిని మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ భవనంగా మార్చనున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ప్రభుత్వ దవాఖాన సిబ్బంది క్వార్టర్స్ భవనంలోకి మార్చనున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా తొలి భవనాన్ని రూ.25 కోట్లతో నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నుంచి 150 మంది విద్యార్థులకు బోధన కొనసాగించేందుకు వీలుగా తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ తదితర వసతులతో మూడంతస్తుల భవనం నిర్మించనున్నారు. ప్రస్తుతం డీఎంహెచ్‌వో భవనం పక్కనే 80 వేల స్కేర్ ఫీట్లలో మూడంతస్తులతో భవన నిర్మాణం చేపట్టనున్నారు. రాబో యే వారం రోజుల్లో ఈ పనులు ప్రారం భం కానున్నాయి. ప్రస్తుతం నిర్మాణ స్థలంలో ఉన్న మొక్కలను అధికారులు తొలగిస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) బృందం జనవరి లేదా ఫిబ్రవరిలో నూతన మెడికల్ కాలేజీ ఏర్పాట్లను పరిశీలించనుంది. ఆలోపు బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.