శని, ఆదివారాల్లో ఓటు నమోదుకు స్పెషల్ డ్రైవ్
అన్ని పోలింగ్ బూత్‌లలో దరఖాస్తుల స్వీకరణ
డిసెంబర్ 20 వరకు సవరణకు అవకాశం
జనవరి1, 2022 వరకు 18 ఏండ్లు నిండిన వారు అర్హులు
జనవరి 15 నాటికి తుది జాబితా రూపకల్పన
సిరిసిల్ల, నవంబర్ 5: కేంద్ర ఎన్నికల సంఘం ఓటు నమోదుకు అవకాశం కల్పించింది.. ఈ మేరకు శని, ఆది వారాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది. జనవరి 1, 2022 నాటికి 18 ఏండ్లు నిండినవారందరూ అర్హులని నిర్దేశించింది. డిసెంబర్ 15 వరకు ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాల సవరణ, మరణించిన వారి, రెండుసార్లు నమోదైన, శాశ్వతంగా వలస వెళ్లినవారిని తొలగింపు ప్రక్రియను చేపట్టనున్నది. ఇందుకు ఆయా జిల్లాకేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 20 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నది. బీఎల్వో, తహసీల్దార్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పింది. కాగా శని, ఆదివారాల్లో ఓటు నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నందున రిసోర్స్ పర్సన్లు, అంగన్వాడీ టీచర్లు ఆయా పోలింగ్ బూత్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని జనవరి 15 నాటికి తుది జాబితాను రూపొందించనున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 537 పోలింగ్ కేంద్రాలు ఉండగా 4,37,317 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,13,079. మహిళలు 2,24,238 మంది.
ప్రక్షాళనకు గరుడ యాప్
ఏటా ఓటరు జాబితా సవరణ చేపడుతున్నా పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరగడం లేదు. డబుల్ ఓట్లు, మరణించినవారి ఓట్లు, ఓటు హక్కు ఉన్న వారి పేరు గల్లంతు, ఓకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు వేర్వేరు ప్రాం తాల్లో ఉండడం లాంటి తప్పులు జరుగుతున్నాయి. వీటిని అధిగమించేందుకు గరుడ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా బీఎల్వోలు ఓటరు కార్డు, కార్డు నంబర్ పోయిన వారు తిరిగి పోందేందుకు అవకాశం కల్పించారు. బీఎల్వోలు ఇంటింటి సర్వే చేపట్టి ఓటరు సవరణ చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రం వివరాలను గరుడ యాప్‌లో నమోదు చేస్తారు. అలాగే జియో ట్యాగింగ్ చేయనున్నారు.
ఫారాల వివరాలు..
ఓటరు నమోదుకు ఫారం-6
జనవరి 1, 2022కి 18 ఏండ్లు నిండివారు ఓటు నమోదు, నియోజకవర్గాన్ని మార్చుకొనేందుకు ఫారం-6ను నింపాలి. దీనికి లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, జనన చిరునామా ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. ఆన్లైన్లో ceotelangana. nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
సవరణకు- ఫారం-8
ఓటరు జాబితాలో మార్పులు, సవరణలకు ఫారం-8 నింపాలి. దీనికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, పేరు, తండ్రి/భార్య/భర్త తదితరాలు జత చేయాలి.
పోలింగ్‌స్టేషన్ మార్పునకు-ఫారం 8ఏ
నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్టేషన్ పరిధిలో నుంచి మరొక పోలింగ్ స్టేషన్‌కు మారితే ఫారం-8 నింపాల్సి ఉంటుంది.
జనవరి-5న అభ్యంతరాల పరిశీలన
డిసెంబర్ 15 వరకు ఓటు నమోదు, అభ్యంతరాల దరఖాస్తులను ఆయా మండలాల పోలింగ్ బూత్ అధికారులు, తహసీల్దార్లు స్వీకరించనున్నారు. 5 జనవరి 2021న వీటిని పరిశీలిస్తారు. అదే రోజు ఓటరు తుది జాబితాలను, నియోజకవర్గాల వారీగా ప్రచురిస్తారు.