మెరుగైన వసతులు,నాణ్యమైన బోధన
కరోనా కారణంగా ప్రై‘వేటు’కు దూరం
అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం
జిల్లా వ్యాప్తంగా 4,546 మంది చేరిక
ప్రైవేట్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలోకి ..
పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి
పెరుగుతున్న హాజరు శాతం
పెద్దపల్లి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కరోనాతో కుంటుపడ్డ సర్కారు బడులు తిరిగి జవసత్వాలను సంతరించుకుంటున్నాయి. సర్కారు చేపట్టిన సంస్కరణ ఫలాలు అందివస్తున్నాయి. సకల హంగులతో కార్పొరేట్‌కు దీటుగా విద్యనందిస్తుండడంతో ప్రవేశాలు ఊపందుకున్నాయి. ఆంగ్ల బోధన, మధ్యాహ్న భోజనం అమలుతో సత్ఫలితాలు వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా ఈ యేడు 4,546 మంది ప్రవేశాలు పొందగా, వీరిలో ప్రైవేటు నుంచి పెద్ద సంఖ్యలో చేరడంతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతున్నాయి.
ఏడాదిన్నర కాలంగా కరోనాతో విద్యారం గం దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నది. పాఠశాలలు మూతపడడంతో సామాన్య, మధ్య తరగతి కు టుంబాల పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఈ క్రమం లో విద్యార్థులు ఫీజుల భారం మోయలేక ప్రైవేట్‌ను వదిలి మౌలిక సౌకర్యాలున్న సర్కారు బడి లో చేరుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 6,624 మంది ప్రవేశాలు పొందారు. అందుకు అనుగుణంగా విద్యాబోధన అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్ కష్టకాలంలోనూ ఇంటి వద్దనే పకడ్బందీగా ఆన్లైన్ తరగతులను నిర్వహించింది. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించింది. సర్కారు స్కూళ్లలో సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం. తాగునీరు, టాయిలెట్ లాంటి సౌకర్యాలు కల్పించడం, క్వాలీఫైడ్ టీ చర్లతో నాణ్యమైన బోధన అందిస్తుండడం, కార్పొరేట్ హంగులు కల్పించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు.
అందుబాటులోకి ఆంగ్ల బోధన..
తల్లిదండ్రులు ఇంగ్లిషు విద్యపై మక్కువతో పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపారు. ఇదే అదనుగా ప్రైవేట్ బడులు టెక్నో, ఈటెక్నో లాంటి ఆకర్షణీయమైన పేర్లతో ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేశాయి. అయితే తె లంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. గాడి తప్పిన విద్యావ్యవస్థను బలోపేతం చేసింది. పాఠశాలల చుట్టూ ప్రహరీల నిర్మాణం మొదలుకొని తరగతి గదులు, మరుగుదొడ్ల దాకా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఆధునీకరించింది. నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఆంగ్లబోధన ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించింది. కస్తూర్బా, మోడల్ స్కూళ్లు ఇలా జి ల్లాలోని 14 మండలాల్లో 764 స్కూళ్లు ఏర్పాటు చేసింది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులకు స్కాలర్ షిఫ్‌లు అందిస్తూ అండగా నిలిచింది. సెప్టెంబర్ ఒకటి నుంచి బడులు పునః ప్రారంభమవుతున్న తరుణంలో ఇప్పటి నుంచే తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నా రు. ఇప్పటికే 4546 మంది వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు.
బడులకు కార్పొరేట్ హంగులు..
మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లావ్యాప్తంగా సర్కారు బడులు కార్పొరేట్ హంగులు సంతరించుకున్నాయి. సీఎస్ఆర్ కింద అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ముందుకొచ్చి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. భారతి, అమెరికన్ ఇండో ఫౌండేషన్, గివ్ తెలంగాణ, మారి, రూమ్టూ రీడ్ ప్రోగ్రాంలతో విద్యార్థులకు ఆకట్టుకుంటున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. కొవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులు అద్భుతంగా నిర్వహించారు.
-జీ శ్రీనివాసరావు, పీఆర్టీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు
జూం విధానంలో బోధించాం..
కరోనా కాలంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జూం విధానంలో పాఠాలు చెప్పించాం. సర్కారు బడుల్లో కల్పించిన సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. కరోనాతో బడులు మూతపడ్డా సకాలంలో పుస్తకాలు, యూనిఫాంలు అందజేశాం. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ విద్యాసంవత్సరంలో ఆడ్మిషన్లు పెరిగాయి. ఇప్పటి వరకు 6424 మంది ప్రైవేట్ బడుల నుంచి అడ్మిషన్లు వచ్చాయి. మున్ముందు పెరుగుతాయని భావిస్తున్నాం. ఎందరూ వచ్చినా చేర్చుకుంటాం. సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని స్కూళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – రాధాకిషన్, రాజన్న సిరిసిల్ల డీఈవో