మర్కూక్ మండలంలో మొత్తం 1080 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు
నేటికీ పూర్తయినవి 691
త్వరలోనే రెండు గ్రామాల్లో గృహప్రవేశాలు
మర్కూక్, నవంబర్ 3: పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటున్నది. ఒక్కో ఇంటికి రూ. 5లక్షల 40 వేలు ఖర్చుచేసి నిర్మిస్తున్నారు. మండలంలోని ఎర్రవల్లిలో 395 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. నర్సన్నపేటలో 225 ఇండ్లు మంజూరు కాగా 220 నిర్మాణం పూర్తి చేశారు. పాములపర్తిలో 190 ఇండ్లు మంజూరు కాగా 51 పూర్తి చేశారు. వీటిని త్వరలోనే లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇటీవల 100 ఇండ్లకు ప్రజాప్రతినిధులు భూమిపూజ చేశారు. శివారువెంకటాపూర్ గ్రామానికి 45 ఇండ్లు మంజూ రు కాగా 45 నిర్మాణ పనులు పూర్తి చేశారు. త్వరలోనే ప్రారంభించనున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జనం జేజేలు పలుకుతున్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడిగా భావిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇండ్లు నిర్మించుకోవాలంటే సర్కారు ఇచ్చే డబ్బులు సరిపోక అప్పులు చేసే పరిస్థితి వచ్చేది. దీనికి తోడు దళారులు అందినకాడికి దోచుకునేవారు. కనీసం ఇండ్లల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నది.
ఇండ్ల నిర్మాణంలో సీఎం దత్తత గ్రామాలు ఆదర్శం
సీఎం కేసీఆర్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను దత్తత తీసుకుని అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. పెంకుటిండ్లను కూల్చివేసి ప్రతి ఒక్కరికీ డబుల్‌బెడ్‌రూ ఇండ్లు నిర్మించి ఇచ్చారు. వీధి దీపాలు, ఇండ్ల మధ్య పార్కులు, చెరువులు, కుంటలను అభివృద్ధి చేశారు. రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కల పెంపకం చేపట్టారు. ప్రస్తుతం ఆ రెండు గ్రామాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాయి. పాములపర్తి, శివారువెంకటాపూర్, మర్కూక్ గ్రామాలకు ఇండ్లను మంజూరు చేశారు. పాములపర్తిలో 51 ఇండ్లు పంపిణీకి సిద్ధం చేయగా…శివారువెంకటాపూర్లో 45 ఇండ్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. మర్కూక్ గ్రామానికి 200 ఇండ్లు మంజూరు కాగా త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లిలో మరో 25 ఇండ్లు, నర్సన్నపేటలో 25 నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు.
బంగారు తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం
బంగారు తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం. దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది. యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వడం అభినందనీయం. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. సాగునీరు, నిరంతర విద్యుత్, కేజీ టూ పీజీ విద్య, పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర పథకాలను అమలు చేసి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.
-కరుణాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు. మర్కూక్