జిల్లాలో తక్కువ వ్యాక్సినేషన్ అయిన గ్రామాలపై సర్వే
వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలకు కౌన్సిలింగ్
మరో పది రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు
జిల్లాలో ఇప్పటివరకు ఫస్ట్ డోస్ 107, సెకండ్ డోస్ 59 శాతం
పట్టణ ప్రాంతాల్లో దాదాపు పూర్తైన ప్రక్రియ
రంగారెడ్డి, నవంబర్ 3, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న ఆదేశాలతో జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రాంతాలను గుర్తించేందుకుగాను గత వారం రోజులుగా సర్వే చేపట్టారు. సర్వే ఆధారంగా సంబంధిత గ్రామాలు, కాలనీల్లో ప్రత్యేక దృష్టి సారించి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఫస్ట్ డోస్‌కు సంబంధించి ఇప్పటికే లక్ష్యానికి మించి పూర్తైన దృష్ట్యా సెకండ్ డోస్‌కు సంబంధించి కూడా త్వరితగతిన వంద శాతం పూర్తి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. గత ఆరేడు నెలలుగా జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లోనూ సింగిల్ డిజిట్‌లోనే పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటికి కూడా ఎవరికైనా జ్వర లక్షణాలు కనిపించినట్లయితే పరీక్షలు చేస్తుండడంతోపాటు కొవిడ్ లక్షణాలున్నవారిపై ప్రత్యేక దృష్టి సారించి చికిత్స అందిస్తున్నారు.
ప్రతీ మూడు రోజులకు లక్ష డోసులు
జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ అమయ్‌కుమార్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ ఇప్పటికే లక్ష్యానికి మించి పూర్తైన నేపథ్యంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ఇందుకుగాను 15 మంది ప్రత్యేకాధికారులను కూడా కలెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో అధికారికి రెండు మండలాల చొప్పున అప్పగించి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. గత వారం రోజులుగా చేపట్టిన సర్వే ఆధారంగా ఆయా గ్రామాలకు, అర్బన్ ప్రాంతంలోని కాలనీలకు వెళ్లి వ్యాక్సిన్ చేస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్
గ్రామీణ ప్రాంతాల్లో అయితే వైద్యారోగ్య సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లోనూ ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ వేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న దృష్ట్యా వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకోగా, ప్రతీ మూడు రోజులకోసారి లక్ష డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో ఫస్ట్ డోస్ 107 శాతం పూర్తికాగా, సెకండ్ డోస్ 59 శాతం మేర పూర్తయ్యింది. అయితే సెకండ్ డోస్‌కు సంబంధించి జిల్లాలో అర్హులైనవారు 10,57,131 మంది ఉండగా, ఇప్పటివరకు 6,10,971 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాగా, మరో 4,46,160 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. 60 ఏండ్లు పైబడినవారు 4,00,683, 40-60 ఏండ్ల వయస్సువారు 7.66 లక్షలు, 18 ఏండ్లు నిండినవారు 24,04,791 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. మొబైల్ యాప్‌తోపాటు నేరుగా ఆధార్ కార్డులతో వెళ్లినవారికి వ్యాక్సిన్ వేస్తున్నారు.
పది రోజుల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి : కలెక్టర్ అమయ్‌కుమార్
జిల్లాలో మరో పది రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. సెకండ్ డోస్‌కు సంబంధించి ఇప్పటికే 59 శాతం మేర పూర్తయ్యింది. మరో 4,46,160 మందికి కూడా పది రోజుల్లో పూర్తి చేసేలా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించాం. జిల్లావ్యాప్తంగా సర్వే చేపట్టి తక్కువ వ్యాక్సినేషన్గల ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు.