చెత్త తొలగించి వీధులను శుభ్రం చేసి
రెండో రోజూ జోరుగా ‘పల్లె ప్రగతి’
ముమ్మరంగా పారిశుధ్య పనులు
బ్లీచింగ్ పౌడర్ చల్లిన జీపీ సిబ్బంది
ఊరూరా శ్రమదానం.. హరితహారం
పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు
పలుచోట్ల మొక్కలు నాటిన ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు
ములుగులో పర్యవేక్షించిన ఫారెస్ట్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి
నమస్తే నెట్వర్క్ : పల్లె, పట్టణ ప్రగతి పనులు రెండో రోజూ జోరుగా జరిగాయి. శుక్రవారం డ్రైడే సందర్భంగా ఊరూవాడన పారిశుధ్య పనులు ముమ్మరంగా చేశారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ చెత్తాచెదారం, మురుగును తొలగించి వీధులను శుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అలాగే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు శ్రమదానం చేసి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. పలుచోట్ల పాత ఇనుప విద్యుత్ స్తంభాలను తీసివేసి కొత్తవి అమర్చారు. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు.
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంతో పాటు చిట్యాలలో మంత్రి సత్యవతి రాథోడ్ మొక్కలు నాటి, హరితహారంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు వద్ద జింకల పార్కులో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి మొక్కలు నాటి పనులను పర్యవేక్షించారు. హసన్‌పర్తి మండలకేంద్రంలోని సిద్దాపూర్, 66 డివిజన్లో పట్టణ ప్రగతిపై వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచనలు చేశారు. గ్రేటర్ 10, 19, 29వ డివిజన్లలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న మేయర్ గుండు సుధారాణి.. మల్లికార్జునస్వామి ఆలయంలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని డోజర్‌తో తీయించి.. పలుచోట్ల మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ధర్మసాగర్ మండలం రాయగూడెంలో ఎమ్మెల్యే రాజయ్య పల్లె నిద్ర చేసి, శాయిపేటలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఎల్కతుర్తి మండలకేంద్రంతో పాటు జగన్నాథపూర్ గ్రామాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్ మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో పల్లె ప్రగతి సమావేశంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొని ఆ తర్వాత మొక్కలు నాటి పారిశుధ్య పనులను పరిశీలించారు. రఘునాథపల్లి మండలం మండెలగూడెంలో జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల నర్సరీ, ప్రకృతి వనాన్ని పరిశీలించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత.. నెక్కొండలోని నందమూరినగర్ ఎస్సీకాలనీలో శిథిలావస్థలో ఉన్న సైడ్డ్రైన్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. హన్మకొండలో లష్కర్‌బజార్, ఈద్గా ప్రాంతాల్లో అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్‌లోని వార్డుల్లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యటించి.. నీళ్లు, బురదతో నిండిన రోడ్లను వెంటనే బాగుచేయాలని సూచించారు. అలాగే సర్పంచ్ శారద అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.