
ఖమ్మం, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒకటే ఆయుధమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇంకా వ్యాక్సినేషన్ తీసుకోని వారు వెంటనే తమంతట తాము ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని సూచించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో బుధవారం విలేకరుల సమావేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఒమిక్రాన్ వ్యాప్తికి నివారణ చర్యల గురించి వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 10,60,576 మందికి మొదటి డోసు టీకా వేశామన్నారు. 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తితో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. వీరిలో 5.50 లక్షల మందికి సెకెండ్ డోసు కూడా పూర్తయిందన్నారు. మిగిలిన వారు కూడా గడువులోగా రెండో డోసు టీకా తీసుకోవాలని సూచించారు. కొత్త వేరియంట్‌ను ఆపడానికి కూడా వ్యాక్సినేషన్ ఒకటే మార్గమన్నారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లో ప్రతిరోజూ 200 టెస్టులు జరుగుతున్నాయని, అవసరాన్ని బట్టి ఇక్కడ కూడా టెస్టుల సంఖ్య పెంచుతామని అన్నారు. ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నామన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో ఉంచుతున్నామన్నారు. ప్రస్తుతం మూడో ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలందరూ స్వీయరక్షణ చర్యలు పాటించాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.