వలిగొండ-కొత్తగూడెం వరకు మరో జాతీయ రహదారి
జిల్లాలో రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా నిర్మాణం
యాదాద్రి భువనగిరి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, రాష్ర్టానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు పలుమార్లు కేంద్రానికి విన్నవించడంతో వలిగొండ-కొత్తగూడెం(ఎన్‌హెచ్-930పీ) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం గౌరెల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, అడ్డగూడూరు, మోత్కూరు మండలాల మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్ మీదుగా కొత్తగూడెం వరకు హైవే నిర్మాణాన్ని చేపట్టనున్నారు. రూ.2 వేల కోట్లతో 234 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించనున్నారు. కొత్త జాతీయ రహదారి కొత్త జిల్లాలైన మహబూబాబాద్, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాలను కలుపుతూ హైదరాబాద్‌కు అనుసంధానంగా ఉండనుంది.
వలిగొండ- తొర్రూరు బైపాస్ రోడ్డు వరకు 69 కిలోమీటర్ల మేర చేపట్టనున్న హైవే నిర్మాణానికి కేంద్రం మొదటి ప్యాకేజీ కింద రూ.600 కోట్లు మంజూరు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 43 కి.మీ.ల మేర జాతీయ రహదారిని విస్తరించనున్నారు. ప్రస్తుతం ఏడు మీటర్ల వెడల్పు ఉన్న ఈ రహదారిని పది మీటర్లకు విస్తరించనున్నారు. జాతీయ రహదారుల విభాగం అధికారులు తయారుచేసిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) చివరి దశలో ఉండగా ఈ నెలలో ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ హైవే అథారిటీకి సంబంధిత నివేదికను అందజేయనున్నారు. సాంకేతికపరమైన అంశాల పరిశీలన అనంతరం అనుమతులు ఇచ్చిన వెంటనే అధికారులు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టిన సంబంధిత అధికారులు మొదటి ప్యాకేజీలో చేపట్టబోయే పనుల్లో కోల్పోయే భూముల వివరాలను రెవెన్యూ శాఖకు అందించారు. జాతీయ రహదారి వెళ్లే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ రోడ్ల నిర్మాణంతోపాటు, రోడ్డు మధ్యలో సెంట్రల్ డివైడర్లతోపాటు రెండువైపులా డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టనున్నారు.
ప్రస్తుతం జిల్లాలో భువనగిరి మీదుగా హైదరాబాద్- భూపాలపట్నం వరకు 163 నంబరు జాతీయ రహదారి, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్- విజయవాడ వరకు 65 నంబరు జాతీయ రహదారులు ఉన్నాయి. భూపాలపట్నం మార్గంలో జిల్లాలో గూడూరు వద్ద, విజయవాడ మార్గంలో పంతంగి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. అయితే కొత్తగా వలిగొండ-కొత్తగూడెం జాతీయ రహదారి ఏర్పాటు కానుండగా…జిల్లాలో అడ్డగూడూరు మండలంలోని చౌళ్లరామారం-బొడ్డుగూడెం మధ్య టోల్‌ప్లాజా ఏర్పాటు కానుంది.
తెలంగాణ జిల్లాల నుంచి విజయవాడకు వెళ్లాలంటే ప్రధాన మార్గంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఉన్నది. దీంతో ఈ జాతీయ రహదారిపై నిత్యం విపరీతంగా ట్రాఫిక్ నెలకొంటోంది. పండుగల సమయంలో ప్రయాణికుల అవస్థలు చెప్పనక్కర్లేదు. ప్రత్యామ్నాయంగా మెరుగైన మరోమార్గం లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ప్రయాణ సమయం పెరుగుతోంది. కొత్త జాతీ య రహదారి అందుబాటులోకి వచ్చాక సూర్యాపేట, ఖమ్మం మీదుగా సుదూర ప్రయాణం చేయాల్సిన అవసరం ఇకపై ఉండదు. హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా వలిగొండ మీదుగా కొత్తగూడెం వరకు తక్కువ సమయంలో.. తక్కువ దూరం ప్రయాణించి చేరుకోవచ్చు.
అంతేకాకుండా.. హైదరాబాద్-వైజాగ్ పోర్టుకు, హైదరాబాద్-చత్తీస్‌గఢ్ మధ్య దూరం కూడా చాలా వరకు తగ్గుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నుంచి భద్రాచలానికి త్వరగా వెళ్లేందుకు ఈ మార్గం అనువుగా ఉండనుంది. అన్నీ సక్రమంగా జరిగితే 2023 చివరి నాటికి నూతన జాతీయ రహదారి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. వ్యవసాయ పరంగా.. పరిశ్రమలు, ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో దూసుకెళ్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు కొత్త జాతీయ రహదారితో మరింత మేలు జరగనుంది.