
విజయగర్జనను విజయవంతం చేయండి
పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు రూరల్, నవంబర్ 1 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గుట్టమల్లారంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2001లో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నవంబర్‌లో నిర్వహించనున్న విజయగర్జన సభను పార్టీ అధిష్ఠానం ఎప్పుడు నిర్వహించినా భారీగా తరలి సభను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ బాధ్యత ఆయా గ్రామ అధ్యక్షులు, సర్పంచులదేనన్నారు. ఇతర పార్టీలు టీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నది వాటిని ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పొడు సమస్య పరిష్కారానికి సీఎం హామీ..
పోడు భూముల సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే రేగా గుర్తుచేశారు. ఈ నెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని, అర్హులకు పట్టాలిచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇకపై ఒక్క చెట్టు కూడా కొట్టకుండా అడవుల పరిరక్షణ బాధ్యతను అన్ని పార్టీలూ తీసుకునే విధంగా జిల్లాలో సమావేశం జరిగిందన్నారు. సర్వేలు, తీర్మానాల అనంతరం సీఎం కేసీఆర్ ద్వారా భద్రాద్రి జిల్లాలో ఉన్న 2.29 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కోలేటి భవానీశంకర్, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు, సీనియర్ నాయకులు మేడా లక్ష్మీనారాయణ, పటేల్ భద్ర య్య, వట్టం రాంబాబు, బూర్గంపహాడ్ ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ మాట్లాడారు. అనంతరం పార్టీ అనుబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిటీలను నియమించారు. మణుగూరు పట్టణ అధికార ప్రతినిధిగా ఎడ్ల శ్రీనును నియమించారు. ఏడు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధ్యక్ష కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులు, సోషల్ మీడియా ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.