నియోజకవర్గ ప్రజలే నాదేవుళ్లు : ఎమ్మెల్యే చిరుమర్తి
చిట్యాల, అక్టోబర్ 1 : సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని, ఆయన నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం చిట్యాలలో టీఆర్ఎస్ నూతన మండల, గ్రామశాఖలతో పాటు అనుబంధ సంఘాల కమిటీల పరిచయ సభ నిర్వహించారు. అంతకు ముందు 2వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో పార్టీ తరఫున వేసిన కమిటీలే ఫైనల్ అని, సభ్యత్వం కూడా తీసుకోకుండా పార్టీ పేరు చెప్పుకొంటూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలే తనకు దేవుళ్లని, ప్రజలందరూ బాగుండాలని రోజూ దేవుడిని కోరుకుంటానని అన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో లేని ఉచిత విద్యుత్ మన రాష్ట్రంలో అమలవుతున్నదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సభ అనంతరం మండల, గ్రామ కమిటీలను సన్మానించారు. పార్టీ మండలాధ్యక్షుడు ఆవుల అయిలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, నార్మాక్స్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎంపీపీ కొలను సునీతా వెంకటేశ్, నార్మాక్స్ డైరెక్టర్ కర్నాటి జయశ్రీవెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రుద్రరాజు భిక్షపతి, వైస్ ఎంపీపీ అలివేలు రాంరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, పట్టణాధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.