
అర్ధ సంవత్సరంలో 29.94 మిలియన్ టన్నుల రికార్డు బొగ్గు ఉత్పత్తి
కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 1 : సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈసారి భారీ వర్షాలు కురిసినా నిర్దేశిత లక్ష్యానికి చేరువగా 98 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం విశేషం. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ముగిసిన అర్ధ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 30.71 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 29.94 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి (98శాతం) సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 6నెలల్లో కేవలం 18.12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది. కరోనా కారణంగా ఆ ఏడాది భారీగా బొగ్గు ఉత్పత్తి తగ్గింది. గత ఏడాదితో పోల్చితే 6నెలల్లో 11.82మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా సాధించడంతో సింగరేణి సంస్థ రానున్న రోజుల్లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది 6 నెలల్లో 179 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరుపగా, ఈ యేడాది 6 నెలల్లో 313 లక్షల టన్నుల బొగ్గు రవాణాను సాధించి 75 శాతం వృద్ధిని చూసింది. గతేడాది 6 నెలల్లో 181 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి ఈ ఏడాది 65 శాతం వృద్ధితో 299 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది.
ఓవర్ బర్డెన్ తొలగింపులో గతేడాది సాధించిన 132 మిలియన్ క్యూబిక్ మీటర్లపై ఈ ఏడాది 26 శాతం వృద్ధితో 166 మిలియన్ క్యూబిక్ మీటర్లు తొలగించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు బొగ్గు ఉత్పత్తి సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్థ నిర్దేశించిన 69.53 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేలా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగుతున్నది. సింగరేణి చరిత్రలోనే 2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 64.40 మిలియన్ టన్నుల రికార్డు బొగ్గు ఉత్పత్తి సాధించింది. అ రికార్డును ఈసారి అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ నెలలో 4.89 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 4.54 మిలియన్ టన్నులు (93శాతం) సాధించింది. సెప్టెంబర్ నెలలో ఆర్జీ-3 ఏరియా రికార్డు స్థాయిలో 3,59,996 టన్నుల లక్ష్యానికి గాను 4,81,219 టన్నుల (134శాతం) బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు నెలకొల్పింది. మణుగూరులో 130 శాతం, ఆర్జీ-2లో 111 శాతం, ఇల్లందులో 102 శాతం, కొత్తగూడెంలో 100 శాతం బొగ్గు ఉత్పత్తి సాధ్యమైంది.