
అన్ని వ్యాక్సిన్లు మంచివే..
మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి
పాజిటివ్ వస్తే హోంక్వారంటైన్లో ఉండటం మంచిది
వ్యాక్సిన్ వేసుకున్న ఆరు వారాలకు యాంటీబాడీలు వృద్ధి
45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
పీహెచ్సీ డాక్టర్ నాగరాజకుమారి
రామచంద్రాపురం, ఏప్రిల్ 25 : కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ధైర్యంగా వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆర్సీపురం పీహెచ్సీ డాక్టర్ నాగరాజకుమారి తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పలు వివరాలు ఆమె మాటల్లోనే.. కోవాగ్జిన్ మంచిదా.? కొవిషీల్డ్ మంచిదా.? అనే సందేహాలు అవసరం లేదు. అన్ని వ్యాక్సిన్లు మంచివే. 45 ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ మొదటి డోస్ అయిన తర్వాత ఆరు వారాలకు యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అప్పటి వరకు మాస్క్, భౌతిక దూరం, శానిటైజేషన్ పాటించాలి. అవసరం లేకుండా బయట ఎక్కువగా తిరుగొద్దు. రెండో డోస్ పూర్తయిన తర్వాత 15 రోజులకు మనిషిలో రోగనిరోధకశక్తి ఎక్కువగా పెరుగుతున్నది. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారమే వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా తీసుకోవచ్చు. ఆల్కహాల్, సిగరేట్ అలవాటు ఉన్న వారు వ్యాక్సిన్ వేసుకున్న రోజు మాత్రం వాటికి దూరంగా ఉండాలి. కరోనా పాజిటివ్ వస్తే ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. హోంక్వారంటైన్లో ఉండి తగ్గిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతున్నది. ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకూడదు. హ్యూమినీటిని పెంచే ఫుడ్ తీసుకోవాలి. పీహెచ్‌సీకి 150 టార్గెట్ ఉంటే ప్రతి రోజు 250 మంది వరకు వ్యాక్సిన్ వేస్తున్నాం. కొద్ది రోజులుగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకువస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా 45 ఏండ్లు నిండిన వారందరు పీహెచ్‌సీకి వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. మే 1 నుంచి 18 ఏండ్ల వారి నుంచి వ్యాక్సిన్ వేయడం ప్రారంభమవుతున్నది. పీహెచ్సీలో అంతమందికి వ్యాక్సిన్ వేయడం కష్టమవుతుందని, తెల్లాపూర్‌లో మరో వ్యాక్సినేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేయనున్నాం.