నాడు గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీటి కోసం పోరాటాలు చేసిన సూర్యాపేట ప్రాంతంలో నేడు ఎటుచూసినా జల సవ్వడి వినిపిస్తున్నది. ఓ పక్క 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కరువు ఛాయలు లేకపోవడం స్వరాష్ట్రంలో స్పష్టమైన మార్పును కళ్లకు కడుతున్నది.నడివేసవిలోనూజిల్లాలోనివందశాతంచెరువులుజలకళనుసంతరించుకున్నాయి.మొత్తం 1,071 చెరువులకు గాను 431 చెరువులునూరు శాతం నిండగా, 27 చెరువులు అలుగు పోస్తున్నాయి. మరో 247 చెరువుల్లో 75 శాతం నీళ్లుఉండగా393 చెరువులు 50శాతం జలకళను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల లభ్యత ఐదు మీటర్ల లోపే ఉండడం విశేషం.
సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం, మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవ ఫలితంగా కోట్లాది రూపాయలతో చేపట్టిన మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ, వేల కోట్ల ఖర్చుతో మిషన్ కాకతీయ పథకం ఫలితాలు నేడు సూర్యాపేట జిల్లాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు జిల్లాలో గుక్కెడు నీటి కోసం కొట్లాటలు, ఆందోళనలు, బిందెలు, కుండలతో మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకునే దృశ్యాలు నిత్యం కనిపించేవి. కానీ నేడు ఇంటింటికీ నీరందుతున్నది. మిషన్ భగీరథ జలాలు ప్రతి గడపకూ తరలివస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల పరిస్థితిని దయనీయంగా ఉండేది. కట్టలు తెగిపోయి, నీళ్లు లేక నెర్రెలు బారి కనిపించేవి. కరువుకు ఆనవాళ్లుగా కంపచెట్లు మొలిచి నీటి ఛాయ మచ్చుకైనా కనిపించేది కాదు. వర్షాకాలంలో నీళ్లు వచ్చి చేరినా నిలిచేవి కావు. అలుగు పారినా పట్టుమని నెల రోజులైనా నిలువని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్ద పీట వేశారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు పునరుద్ధరించారు. పూడిక తీయించి, కట్టలు బలోపేతం చేశారు. ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పట్టేలా ప్రణాళికలు రూపొందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువునూ గోదావరి జలాలతో నింపారు.