
కోహీర్, ఆగస్టు 6 : మాజీ జడ్పీటీసీ, పీచెర్యాగడి సొసైటీ చైర్మన్ అరవింద్‌రెడ్డి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ దివంగత అరవింద్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ అరవింద్‌రెడ్డి జడ్పీటీసీగా ఉన్నప్పుడూ జిల్లా పరిషత్ సమావేశాల్లో రైతు సమస్యల గురించే మాట్లాడేవారన్నారు. కరోనా నుంచి ఆయనను కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అరవింద్‌రెడ్డి ఆశయాలను ఆయన సతీమణి సొసైటీ చైర్పర్సన్ స్రవంతీరెడ్డి కొనసాగించాలని సూచించారు. అరవింద్‌రెడ్డిపై ప్రేమతో కోహీర్‌లో ఎకరం స్థలంలో రూ.50లక్షల వ్యయంతో సొసైటీ భవనాన్ని నిర్మిస్తామని హామీనిచ్చారు. పోతిరెడ్డిపల్లి పాఠశాల అభివృద్ధి కోసం రూ.30లక్షలు, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి రూ.25లక్షలు మంజూరు చేస్తామని వెల్లడించారు. అంతకుముందు వెంకటాపూర్ గ్రామంలోని రైతు వేదికలో ప్రొ.జయశంకర్‌సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆశయాలను కొనసాగించాలి..
అరవింద్‌రెడ్డి ఆశయాలను పీచెర్యాగడి సొసైటీ చైర్పర్సన్ స్రవంతీరెడ్డి ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి కోరారు. నిరంతరం ప్రజాసమస్యలపై తన గళాన్ని వినిపించేవాడన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. సంతాప సభలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, జహీరాబాద్, తాండూర్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, నరేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, పట్నం మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ రాందాస్, సర్పంచులు రమేశ్, నర్సింహులు, వెంకట్రాంరెడ్డి, రాజశేఖర్, పాల్గొన్నారు.