
గర్భిణులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
పోలింగ్ కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లు
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ఖమ్మం, ఏప్రిల్ 28: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. నగరంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో కేఎంసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి తగిన వసతులు ఏర్పాటు చేయాలని, తాగునీరు, విద్యుత్, భోజనాలు, శానిటైజర్, మాస్కులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అనంతరం ఖానాపురం కరెంట్ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. గర్భిణులు, వికలాంగులు తమ ఓటు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఈఈ కృష్ణలాల్, డీఏవో విజయనిర్మల పాల్గొన్నారు.
ఖర్చుల వివరాలు అందజేయాలి..
కేఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలు నిర్ణీత గడువులోగా అందజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు బీ.రాజు సూచించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులతో జిల్లా సహకార శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచారం ముగిసినందున నామినేషన్, ప్రచార ఖర్చుల వివరాలను తమకు సమర్పిస్తే వాటిని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపుతామని అన్నారు. సహకార కార్యాలయ ఏఓ ప్రసాద్, సందీప్‌కుమార్ జోత్స్న పాల్గొన్నారు.