
టేక్మాల్, అక్టోబర్ 8 : అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ‘ఈ-శ్రమ్’ను తీసుకువచ్చింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలతో పాటు రూ.2లక్షల ప్రమాద బీమాను అందిస్తుండడంతో అసంఘటిత కార్మికులకు ప్రయోజనం చేకూరనున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అసంఘటిత రంగ కార్మికుల నమోదు లక్ష్యం 2.50లక్షలు. కామన్ సర్వీస్ సెంటర్లలో ఈ నమోదు ప్రక్రియను ఉచితంగా చేస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు మూడువేల వరకు నమోదు చేశారు.
అసంఘటిత రంగ కార్మికులు వీరే..
వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో ఉపాధి పొందే చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవన, నర్సరీలు, పాడిపరిశ్రమలపై ఆధారపడే వారు, మత్స్యకార్మికులు.
భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే తాపీ మేస్త్రీలు, తవ్వకం, రాళ్లు కొట్టే పని, సెంట్రింగ్, ప్లంబింగ్, కార్పెంటర్, శానిటరీ, పెయింటింగ్, టైల్స్ పని, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఇటుక, సున్నం బట్టీల పనులు చేసేవారు.
టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకర్, ఆటోమొబైల్స్, రవాణా రంగాల్లో పనిచేసే డ్రైవర్లు, హెల్పర్లు, చేనేత, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, క్షౌరవృత్తి, బ్యూటీ పార్లర్లలో పనిచేవారు, చర్మకారులు, రజకులు.
స్వయం ఉపాధి పొందే వీధి, తోపుడు బండ్ల వ్యాపారులు, ఇంటి వద్ద వస్తువులు తయారు చేసేవారు, చిరు వ్యాపారులు, కల్లుగీత కార్మికులు, కళాకారులు, రిక్షా కార్మికులు.
ఉపాధి హామీ కూలీలు, ఆశవర్కర్లు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన వర్కర్లు, విద్యావలంటీర్లు, హమాలీలు.
ఎవరెవరు అర్హులంటే..
తప్పనిసరిగా అసంఘటిత రంగ కార్మికులై 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారు ఇందులో చేరవచ్చు. ఆదాయ పన్ను చెల్లించనివారు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి సదుపాయాల పరిధిలోనికి రాని వారు మాత్రమే దీనికి అర్హులు.
ఇవి ప్రయోజనాలు..
‘ఈ-శ్రమ్’లో చేరిన ప్రతి కార్మికుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్-యూఏఎన్) ఇస్తారు. భవిష్యత్‌లో ఈ కార్డుంటేనే ప్రభుత్వ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తిస్తాయి.
ఇప్పటి వరకు కొన్ని పథకాలు కుటుంబంలో ఒక్కరికే మాత్రమే వర్తిస్తున్నాయి. దీనివల్ల ఆ కుటుంబంలో అదనంగా ఒకరిద్దరు అసంఘటిత రంగ కార్మికులుంటే నష్టపోతున్నారు. ఇప్పుడా సమస్య ఉండదు. ‘ఈ-శ్రమ్’ కార్డున్న అందరికీ ప్రయోజనాలు దక్కుతాయి.
ఇందులో నమోదైన ప్రతి కార్మికుడికి ఒక ఏడాది పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2లక్షల ప్రమాద బీమా, అంగవైకల్య బీమా ఉచితంగా వర్తిస్తుంది.
ఎక్కడ నమోదు చేసుకోవాలి..
కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, కార్మిక కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వెంటనే యూఏఎన్‌తో కూడిన ‘ఈ శ్రమ్’ కార్డును జారీ చేస్తారు. ఈ కేవైసీ కలిగిన ఆధార్‌కార్డు, ఆధార్‌కార్డుతో అనుసంధానమైన ఫోన్‌నంబర్, బ్యాంకు ఖాతాతో నమోదు కేంద్రాలకు వెళ్లాలి.
ఉచితంగా నమోదు…
అసంఘటిత రంగ కార్మికుల నమోదు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లాలో 2.50లక్షల మంది అసంఘటిత కార్మికులను చేర్పించాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి 1291 సెంటర్లలో నమోదు కార్యక్రమం నిర్వహించాం. ఈ సెంటర్లలో కార్మికులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ లేని ప్రతి కార్మికుడు ఇందుకు అర్హులు.