రుద్రంగి, మే 2: మీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆపత్కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఈజీఎస్ పనులను విస్తృతంగా చేపట్టింది. ఎన్నో ఇబ్బందులు పడిన కూలీలకు వేతనాలు పెంచుతూ ఉపాధి కల్పిస్తున్నది. గతంలో ప్రభుత్వం దినసరి కూలీ రూ.237 చెల్లించేది. ఏప్రిల్ నుంచి రూ.245 పెంచి చెల్లిస్తున్నది. కరోనా కారణంగా కూలీల కుటుంబాలకు ఇబ్బంది పడ్డా యి. ప్రభుత్వం వీరి కష్టాలను గుర్తించి వేతనాలను పెంచడంతో నిరుపేద కూలీల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు చేసేలా అధికారులు కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామాల్లో జోరుగా పనులు
రుద్రంగి, మానాల, గిరిజన గ్రామపంచాయతీల్లో ఈజీఎస్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామాలతోపాటు అటవీ, పంట భూముల్లో నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. భూగర్భ జలాలు పెంచేందుకు ఈజీఎస్ ద్వారా పనులు చేయిస్తున్నది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూలీలు ఉదయమే పనులకు వెళ్తున్నారు. కందకాల నిర్మాణాలతో అనేక లాభాలున్నాయని సంబంధిత అధికారులు ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
3,855 మంది కూలీలు
ప్రస్తుతం మండలంలో 255 గ్రూపుల్లో 3,855 మంది కూలీ లు ఉన్నారు. దాదాపు 2వేల మంది ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. నూతన గ్రామ పంచాయతీల్లో చాలా మందికి జాబ్‌కార్డులు లేవు. దీంతో సంబంధిత అధికారులు వారికి జాబ్‌కార్డులు మంజూరు చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఈజీఎస్ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. అర్హులందరికీ జాబ్ కార్డులు అందజేస్తున్నాం. ప్రతి కూలీకి పని కల్పిస్తాం. కరోనా వ్యాప్తి ఉన్నందున కూలీల సంఖ్య తక్కువగా ఉన్నది. కరోనాపై కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. పని వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి పనులు చేయిస్తున్నాం. పనులు చేసేటప్పుడు కూలీలు జాగ్రత్తలు పాటించాలి.