Yadadri Temple | ‘నభూతో.. నభవిష్యతి!’ అనేలా యాదాద్రి పునర్నిర్మాణం ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఆయన అంతరంగంలో మెదిలిన ఊహా చిత్రానికి దర్శనీయ భౌతిక రూపమివ్వడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ఒకరు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి. కిషన్‌రావు. యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్. ముఖ్యమంత్రి మనో సంకల్పాన్ని వాస్తవంలోకి తీసుకొచ్చిన కార్యదీక్షాపరుడు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా.. ఈ దివ్య క్షేత్రం పునర్నిర్మాణం గురించి ఆయన చర్చించిన ముఖ్య విషయాలు..
పూర్వం నుంచే యాదాద్రి సుప్రసిద్ధ క్షేత్రం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చేవారు. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తీవ్ర నిరాదరణకు గురైంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందునుంచే యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్నది కేసీఆర్ సంకల్పం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో.. ఆలయాభివృద్ధి సంకల్పం కార్యరూపం దాల్చింది. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకరంగ కోణంలోనూ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ ఆవశ్యకత ఉంది. అందుకే, ముఖ్యమంత్రి దీక్షలా భావించి, యాదాద్రి క్షేత్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తన ఆలోచనలు కార్యరూపం దాల్చేలా ముందుండి మమ్మల్ని నడిపించారు.
ఆలయం పునర్నిర్మాణ ప్రణాళిక రూప కల్పనకే ఏడాది సమయం తీసుకున్నాం. ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం ఆలయ నిర్మాణం ఉండాలని, నిష్ణాతులైన స్థపతులను సంప్రదించాం. నిపుణులైన ఇంజినీర్ల సహకారం తీసుకున్నాం. కళా దర్శకులు ప్రత్యేక సాయం అందించారు. ఈ ముగ్గురి సమన్వయంతో ముందడుగు వేశాం. గుట్ట సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, అన్ని జాగ్రత్తలతో.. ప్రణాళిక రూపొందించాం. దానిని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు నాటి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్‌కు చూపించాం. వారి అనుమతితో పనులను మొదలుపెట్టాం.
యాదాద్రి ఆలయం వెయ్యేండ్ల వరకూ పటిష్ఠంగా నిలవాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. ఆ స్థాయి నాణ్యత కోసమే కృష్ణశిలలను ఉపయోగించి, సంప్రదాయ పద్ధతులలో ఆలయ నిర్మాణం చేపట్టాం. ఇలాంటి బృహత్తర ఆలయ నిర్మాణానికి ఇరవై ఏండ్లకు పైగా సమయం పడుతుంది. కానీ, భగవంతుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి పట్టుదలతోపాటు వారు అందించిన ప్రోత్సాహంతో అత్యంత వేగంగా పనులు పూర్తి చేశాం. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన సర్వాధికారాలనూ ముఖ్యమంత్రి నా దగ్గరే ఉంచారు. దీంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులతోపాటు మేం సాయం కోరిన ప్రతి ఒక్కరూ సరైన తోడ్పాటు అందించారు.
ఆధ్యాత్మిక క్షేత్రాలతో భక్తిభావంతోపాటు సాంస్కృతిక వికాసం కూడా ఫరిడవిల్లుతుంది. మన దేవాలయాలన్నీ సహజ సాంస్కృతిక వికాసానికి నెలవులు. శాస్త్రీయ నాట్యకళలు, సంగీత వాయిద్యాలు, కీర్తనలు, భక్తి భావాల ద్వారా భగవత్ తత్వాన్ని చాటుతాయి. యాదాద్రిలోనూ తదనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. భక్తి యోగం ద్వారా ప్రజలను సన్మార్గంలో నడిపించేలా, యాదాద్రికి వచ్చేవారిలో కనీసం లక్షమంది అయినా పండితోత్తముల ప్రవచనాలను వినగలిగేలా అవకాశం కల్పించాం.
దైవకార్యాలు సమర్థంగా పూర్తి కావాలంటే భగవంతుడి దయ ఉండాలి. ఇలాంటి బృహత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో నాకు సంపూర్ణ అండ దొరికింది. పునర్నిర్మాణ పనుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవారు. అద్భుతమైన సహకారాన్ని అందించారు. అందుకే, ఇంత పెద్ద ఆలయ నిర్మాణం చేపట్టినా, నాకు ఎలాంటి సవాళ్లూ ఎదురుకాలేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి సహకారంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం విజయవంతంగా పూర్తయింది.
పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణంలో తలెత్తే మరో సవాలు.. భక్తుల దర్శనాలు. ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాదే. కొండపైనే తాత్కాలిక బాలాలయాన్ని ప్రధాన గర్భగుడిని పోలి ఉండేలా తీర్చిదిద్దాం. భక్తులంతా ప్రధాన మూలవిరాట్‌ను దర్శించుకుంటున్న అనుభూతి పొందేలా ఏర్పాట్లుచేశాం. నిర్మాణ సమయంలో ప్రధాన గర్భగుడికి కానీ, మూలవిరాట్‌కి గానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
యాదాద్రి నరసింహస్వామి సన్నిధి అనంతశక్తికి కేంద్రబిందువు. ఆ శక్తిని క్రమబద్ధీకరిస్తూ పూర్వం రుషులు మూలమూర్తి పాదాల చెంత యంత్రం ప్రతిష్ఠించారని స్థలపురాణం. దండకారణ్యంలోని మునులంతా యాదాద్రికి తరలి వచ్చి, తమ తపశ్శక్తినంతా యంత్ర రూపంలో నిక్షిప్తం చేసి ఇక్కడ స్థాపించారట. మళ్లీ 300 సంవత్సరాల కిందట వానమామలై పీఠాధిపతి తీర్థయాత్రలు సాగిస్తూ యాదాద్రికి వచ్చారు. ఆయన హయాంలోనే స్వామివారి కైంకర్యాల క్రమబద్ధీకరణ జరిగింది. ఆయనే యాదాద్రిలో మరో యంత్రాన్ని ప్రతిష్ఠించారట. 150 ఏండ్ల కిందట బెల్లంకొండ స్వామివారు యాదాద్రిలో కఠోర తపస్సు చేశారట. ఆ తపశ్శక్తినంతా ధారపోసి ఆలయంలో మరో యంత్రాన్ని నెలకొల్పారు. ఈ యంత్రాన్ని స్వామివారి సన్నిధిలో నేటికీ చూడొచ్చని ఆలయ అర్చకులు చెబుతున్నారు.