Yadadri | కొత్తగా ముస్తాబైన యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, ప్రకృతి రమణీయతకూ ఆలవాలం. కొండపైన పచ్చదనం, కింద పచ్చదనం, చుట్టూ పచ్చదనంతో ఈ దివ్య క్షేత్రం హరితాద్రిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రికి హరితహారాన్ని అలంకారంగా తీర్చిదిద్దారు. పూల మొక్కలు, దేవతా వృక్షాలతో ఆధ్యాత్మికత, ఆహ్లాదాల మేళవింపుగా ముస్తాబు చేశారు.
యాదాద్రిలో అడుగుపెట్టిన భక్తుడికి పచ్చదనం స్వాగతం పలుకుతుంది. కొండ కింది నుంచి స్వామివారి ఆలయం రాజగోపురం వరకు కనుమ దారిలో కనువిందు చేసే మొక్కలు, చెట్లు దర్శనమిస్తాయి. ఆలయం పరిసరాలు ప్రకృతి సంపదకు ఆలవాలంగా ఉండాలని పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు అధికారులు. ఉద్యానవనాల ఏర్పాటు, మొక్కలు నాటే కార్యక్రమం చివరి దశకు చేరుకున్నాయి. కొండ చుట్టూ ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూల మొక్కలు, ఔషధ మొక్కలు, దేవతా వృక్షాలు పెంచుతున్నారు. ప్రధాన ఆలయం ఉత్తరం వైపు నందివర్ధనంతోపాటు ఇతర పూల మొక్కలు పెంచుతున్నారు. ఈ పూలను స్వామివారి సేవకు వినియోగిస్తారు. కొండపైకి చేరుకునే మొదటి ఘాట్ దారిని పచ్చదనానికి చిరునామాగా మార్చారు. గిరి ప్రదక్షిణ మార్గంలో నక్షత్ర వనం ఏర్పాటుచేశారు. 27 నక్షత్రాలు, 12 రాశులకు సంబంధించిన చెట్లు ఇక్కడ పెంచుతున్నారు. వీటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆయా గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
కొండ చుట్టూ రహదారి వెంట 7,400 భారీ వృక్షాలు, 20 వేలకు పైగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. వీటితోపాటు సంపెంగ, నాగావళి, విరజాజి, సన్నజాజి తదితర పూల చెట్లను నాటారు. ఏక బిల్వం, మారేడు, రావి, మర్రి, వేప, జువ్వి తదితర దేవతా వృక్షాలనూ పెంచుతున్నారు. కొండ చుట్టూ సుమారు 10 ఎకరాలలో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు ఏర్పాటుచేశారు. కొండ దక్షిణ భాగంలో ఆలయ సమీపంలో మినీపార్క్ అభివృద్ధి చేస్తున్నారు. స్వామివారి దర్శనం తర్వాత భక్తులు ఇందులో హాయిగా విహరించవచ్చు.