Maha Shivratri | పరమేశ్వరుడి రూపం విచిత్రం. విభూతి ధరిస్తాడు. గజచర్మం చుట్టుకుంటాడు. విష సర్పాలు ఆయనకు హారాలు. సగం మిగిలిన నెలవంక ఆయన శిరస్సున అలంకారం. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో దూకే గంగను నెత్తిన పెట్టుకున్నాడు. వయసుడిగిన వృషభం.. వాహనం. మెడలో కపాలమాల. చేతిలో త్రిశూలం. ఏమిటీ చిత్రవిచిత్రమైన ఆహార్యం. మామూలు కండ్లతో చూస్తే శివయ్య లీల ఓ పిచ్చి జంగమదేవర తీరు. అదే కండ్లు మూసుకుని మనసు తెరచి చూస్తే అనంతమైన శివ వైభవం సాక్షాత్కరిస్తుంది. ఆ స్వామి ఆకారం, ఆహార్యం అన్నిటా అంతులేని ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి.
త్రిశూలం అంటే మూడు కొనలు కలిగినదని అర్థం. ఇవి సత్త్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు. ఆ మూడుకొనలు పిడి దగ్గర కలుసుకుంటాయి. త్రిగుణాల ఏకత్వానికిది సంకేతం. యోగపరంగా చూస్తే త్రిశూలంలోని మూడుకొనలు మానవ శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు సంకేతాలు. ఈ మూడు నాడులు శిరస్సులో ఉండే జ్ఞానకేంద్రం దగ్గర కలుస్తాయి. ఇదే త్రివేణీ సంగమం. త్రిగుణాల ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న పరమేశ్వరుడు ‘నేనీ త్రిగుణాలకు అతీతుడను’ అనే సత్యాన్ని ప్రకటిస్తాడు.

శివుడి చేతిలోని డమరుకం కేవలం వాద్యం మాత్రమే కాదు. తత్వ చింతనకు అదొక వేదిక. మనం రాస్తున్న అక్షరాలకు శివయ్య చేతిలోని డమరుకమే ఉత్పత్తి స్థానమని శాస్ర్తాలు చెబుతున్నాయి. శివుడు తాండవం చేస్తూ.. చివరిగా తన డమరుకాన్ని మోగించాడట. ఆ సమయంలో 14 రకాలైన ధ్వనులు వెలువడ్డాయి. సనకాది మహర్షులు వీటిని గ్రహించారు. ఈ విధంగానే భాషాశాస్త్రం ఆవిర్భవించిందని శాస్త్ర వచనం.
శివుడి సిగ మీద నెలవంక వెన్నెల వెలుగులీనుతూ కనిపిస్తుంది. అలా అర్ధ చంద్రుడిని ధరించటమే శివుడి ఔదార్యాన్ని ప్రకటిస్తుంది. దక్షప్రజాపతి అల్లుడైన చంద్రుడు తన 27 మంది భార్యల్లోనూ రోహిణి అంటేనే ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇది సహించలేని ఇతర భార్యలు తండ్రి అయిన దక్షుడికి భర్తపై ఫిర్యాదు చేస్తారు. దక్షుడు కోపంతో అల్లుడైన చంద్రుడిని శపిస్తాడు. ఆ శాపం పోగొట్టుకునే క్రమంలో శివుడి అనుగ్రహం పొందిన చంద్రుడు.. ఫాలనేత్రడి సిగ మీద అలంకారంగా నిలిచాడు. అప్పటి నుంచి శివుడు చంద్రశేఖరుడయ్యాడు.
పరమేశ్వరుణ్ని చూడగానే ఆయన మెడలో ఆభరణంగా వెలుగుతున్న వాసుకి కనిపిస్తుంది. సర్పరాజు వాసుకి తపస్సు చేసి శివుణ్ని మెప్పించి ఆయనకు కంఠహారంగా మారాడు. నిరంతరం స్వామిసేవలో తరిస్తుంటాడు. తల్లి కద్రువ శాపానికి భీతిల్లిన వాసుకి మహాశివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. సర్పాన్ని మెడలో ఆభరణంగా ధరించినవాడు కాబట్టి పరమేశ్వరుడు నాగాభరణుడు, నాగభూషణడు అయ్యాడు.
పరమేశ్వరుణ్ని చూడగానే అందరినీ ఆకర్షించేది ఆయన మూడో నేత్రం. నుదుటి భాగంలో నేత్రాన్ని ఉంచుకున్న కారణంగా శివయ్య త్రినేత్రుడయ్యాడు.
సాధారణ భాషలో మూడోకన్ను అంటారు. ఈ త్రినేత్రం సాధారణ కన్నులా కనిపిస్తున్నప్పటికీ.. ఇది చూసేందుకు ఉపయోగించేది కాదు. ఇది జ్ఞాన నేత్రం. సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ఈ నేత్రం ప్రకటిస్తుంది. ఇది ఆజ్ఞాచక్రానికి స్థానం.

శివుడి వాహనం నంది. కేవలం వాహనం మాత్రమే కాదు… భక్తులకు శివయ్యకు మధ్య వారధి కూడా బసవయ్యే. ఆలయానికి వచ్చిన భక్తులు నంది కొమ్ముల ద్వారా శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. నంది ధర్మానికి ప్రతీక. శివుడు ఎక్కడ కొలువుంటే అక్కడ నంది ఉంటాడు. నంది లేని శివాలయం ఉండదు. అంటే శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం కొలువై ఉంటుందని అర్థం.