నదీ రజస్వల అంటే ఏమిటి? ఆ సమయంలో పుణ్యనదుల్లో స్నానం చేయడం దోషం అంటారు ఎందుకు?
మహర్షుల తపశ్శక్తి నదీజలాల్లో నిక్షిప్తమై ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి, శాస్త్రవిధానంగా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మన విశ్వాసం. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నదీస్నానం చేయకూడదని సూచించారు పెద్దలు. నవగ్రహాలకు నాయకుడైన రవి కర్కాటక సంక్రమణం మొదలు రెండు నెలలు నదీ స్నానం నిషిద్ధం. ఈ కాలం నదులకు రజస్వల దోషం ఉన్న సమయంగా శాస్ర్తాలు పేర్కొన్నాయి.
నదులకు రజస్వల దోషం అంటే నదిలోకి కొత్తనీరు వచ్చి చేరడం అన్నమాట. వరద జలాలు వచ్చి నదిలో చేరే సమయంలో నదీ జలాలు మలినమవుతాయి. ఈ సమయంలో నదీస్నానం వల్ల అనారోగ్యాల బారినపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, నది పోటు ఎక్కువగా ఉండే కాలంలో నదుల్లోకి వెళ్తే ప్రమాదాలు జరగవచ్చు. ఇలా ప్రకృతిలో జరిగే మార్పులను గమనిస్తూ, సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మన పూర్వికులు నదీ రజస్వల సమయంలో స్నానం చెయ్యకూడదని నిషేధం విధించారు. తప్పనిసరిగా నదీ స్నానం చేయాల్సి వస్తే క్షౌరం, ఉపవాసం వంటి కొన్ని నియమాలను నిర్దేశించారు.
డా॥ కప్పగంతు రామకృష్ణ