ఒక రైతు తన పదహారేండ్ల కొడుకును తీసుకుని గుడికి వెళ్లాడు. అక్కడ ఓ పండితుడు భగవద్గీత శ్లోకాలు చదివి వాటికి అర్థం చెబుతూ ఉన్నాడు. ఊరి జనమంతా అక్కడ పోగై ఉన్నారు. మంచి మాటలు నాలుగు చెవిలో వేసుకుందామని రైతు, తన కొడుకుతోపాటు అక్కడే కూర్చున్నాడు. కార్యక్రమం పూర్తయ్యాక ఇద్దరూ గుడిలోని దేవుడికి నమస్కరించి, ప్రసాదం తీసుకుని పొలాల మీదుగా ఇంటికి బయలుదేరారు. దారిలో కొడుకు ‘ప్రేమించడం ఎందుకు మంచిది? కోపం ఎందుకు చెడ్డది?’ అని ప్రశ్నించాడు. చిన్నగా నవ్విన తండ్రి అక్కడ ఉన్న వేరుశనగ తోటల్ని చూపాడు. ‘ఒక్క వేరుశనగ గింజను మన భూమిలో నాటి నీళ్లు పోస్తే ఏమవుతుంది?’ అని కొడుకును అడిగాడు. ‘అది కూడా తెలియకుండా వ్యవసాయం చేస్తున్నానా! వేరుశనగ గింజ కొన్నాళ్లకు మొలకెత్తి మరో ఇరవై కాయలను మనకు అందిస్తుంది.
అందులో ఒక్కో కాయకు రెండు నుంచి మూడు గింజలు వస్తాయి. అంటే ఓ గింజ, అరవై గింజలకు పైగా అవుతుంది’ అని బదులిచ్చాడు. వెంటనే తండ్రి ‘వేరుశనగ గింజను నాటి నీళ్లు పోయడం అనేది మనం ఇతరులను ప్రేమించడం లాంటిది. ప్రేమ అనే విత్తనాన్ని మన మనసులో నాటి దాన్ని ప్రోత్సహిస్తే అది వందలాది మధురమైన ఫలాలను ఇస్తుంది. అదే వేరుశనగ కాయను వేడి చేసి భూమిలో నాటి చూడు. ఎన్ని నీళ్లు పోసినా ఆ గింజ మొలకెత్తదు.
వేడి చేసేటప్పుడు గింజకు మరింత సెగ తగిలితే ఆ గింజ మాడి మసై పోతుంది. కోపం కూడా అంతే. మనల్ని కోపం ఆవహించినప్పుడు మంచీచెడ్డా తెలియదు. అది ఎదుటివారిని బాధపెట్టడమే కాకుండా మనం కూడా ఆ కోపానికి బలైపోతాం. అందుకే ‘తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష’ అని పెద్దలు చెబుతారు అని వివరించాడు. ప్రేమకు, కోపానికి వ్యత్యాసాన్ని తెలుసుకున్న కొడుకు తోటలోని ఓ వేరుశనగ మొక్కను పెరికి ఒక్కో గింజను కొరికి తింటూ తండ్రిని అనుసరించాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు,93936 62821