‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, శ్రీకృష్ణుడికి సమర్పించి, ఆపై వాటిని ఇంట్లోగానీ లేదా ఇంటి ప్రాంగణంలో గానీ వరుసలలో అమర్చుతారు. హైందవ సంప్రదాయంలో కొన్నిచోట్ల దీపావళి పండుగను నూతన సంవత్సర దినంగా కూడా పాటిస్తారు. దీపావళి వెనుక పురాణోక్తమైన కథలు ఎన్నో ఉన్నాయి. త్రేతాయుగంలో రావణాసురుణ్ని సంహరించిన తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలోకి ప్రవేశించి, సింహాసనం అధిష్ఠించిన పర్వదినం ఇదే! ద్వాపరంలో అల్లరి పిల్లవాడైన శ్రీకృష్ణున్ని యశోదమ్మ రోలుకు కట్టేయడం, చిన్ని కృష్ణుడు.. ఊపున బోయి మానులను కూల్చిన లీలను ప్రదర్శించిన రోజూ ఇదే. శ్రీకృష్ణ ఇష్టసఖి సత్యభామ.. నరకాసురుణ్ని సంహరించిన సందర్భంగా దీపావళి చేసుకుంటున్నాం.
శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో ‘సోదరుడైన భరతుడు ఆహ్వానించగా, ఉత్సవ శోభితమైన అయోధ్యలో శ్రీరామచంద్రుడు ప్రవేశించాడు’ అని శ్రీమద్భాగవతం పేర్కొన్నది. ఆనాటి ఉత్సవమే నేటికీ దీపావళిగా కొనసాగుతున్నది. రాముడి రాకతో అయోధ్యవాసులు ఎంతగా పరవశించిపోయారంటే, గాఢనిద్ర నుండి అప్పుడే స్పృహలోకి వచ్చినట్లు వారంతా భావించారు. వీధులన్నిటినీ విశేషంగా అలంకరించి, ఇంటి ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి, వీధి చివర్లలో అరటి తోరణాలను కట్టారట. మంగళకరమైన వాద్యాలతో దేవాదిదేవుడైన శ్రీరామచంద్రుడిని నగరంలోకి స్వాగతించారట.
శ్రీరామచంద్రుడు అవతరించిన త్రేతాయుగంలో ఆరంభమైన ఈ దీపావళి, యుగయుగాలుగా కొనసాగుతూనే ఉండటం విశేషం. ప్రామాణిక సంప్రదాయాలు, గురుశిష్య పరంపరల కారణంగా ఈ సంప్రదాయం నేటికీ సజీవంగా ఉంది. దీపావళి ఉత్సవానికున్న మరో విశేషం దామోదర లీల. దీపావళి రోజున సంభవించిన దామోదర లీల కారణంగానే కార్తిక మాసానికి దామో దర మాసమని పేరు వచ్చింది. అసలు శ్రీకృష్ణుడికి ‘దామోదరుడు’ అనే పేరు ఎలా వచ్చిందో హరివంశం (విష్ణు పర్వము 7.36)లో కనిపిస్తుంది. ‘స చ తేనైవ నామ్నా తు కృష్ణో వైదామ బంధనాత్ గోప్పే దామోదర ఇతి గోపీభిః పరిగీయతే’- సంస్కృతంలో ‘దామం‘ అంటే ‘తాడు’ అని, ‘ఉదర‘ అంటే ‘పొట్ట’ అని అర్థం. కొంటెచేష్టలు చేస్తున్న చిన్నికృష్ణుడి ఉదరాన్ని తల్లి యశోదమ్మ తాడుతో చుట్టి రోకలికి కట్టివేసిన లీలా వృత్తాంతపరంగా కన్నయ్యకు ఏర్పడిన నామమే ‘దామోదర’. దీపావళి నాడే ఈ దామోదర లీల కూడా జరిగిందని శ్రీల సనాతన గోస్వామి రచించిన ‘బృహద్ వైష్ణవ తోషని’ గ్రంథం ఆధారంగా ఆచార్య శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల వారు వివరించారు.
పండుగలన్నీ ఏదో ఒకవిధంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు లేదా శ్రీరామచంద్రునికి సంబంధించినవై ఉంటాయి. ఆ భగవత్సంబంధాన్ని తెలుసుకొని సరైన అవగాహనతో, భక్తి భావనతో ఈ పండుగలను జరుపుకొన్నప్పుడు వాటివల్ల ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుంది. తత్ ఫలితంగా భగవంతుని లీలల్లో మనమూ భాగమయ్యే భాగ్యం దక్కుతుంది. ఈ ఉత్సవాల్లోని ఆంతర్యాన్ని గ్రహిస్తే పండుగ పరమానంద భరితంగా మారుతుంది.