మనిషికి మంచి ప్రవర్తనే మహా సంపద. మానవ జన్మ చరితార్థమయ్యేది ఇక్కడే. అందుకు ప్రతి మతంలోనూ విధిగా పాటించదగ్గ కొన్ని నైతిక సూత్రాలున్నాయి. క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక జీవన విధానంలో దుర్గుణాలు, సుగుణాల పట్ల ఓ పరిపూర్ణమైన అవగాహనతో మెలకువతో ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. ఓ మనిషి పాపకార్యాలు చేయడానికి అనేక కారణాలు కనిపించొచ్చు. ఇంటి వాతావరణం, సంఘ ప్రభావం మొదలైనవి ఎన్ని ఉన్నా మనిషిలోని మనసూ మరికొన్ని కారణాలకు లొంగిపోతుంది. అప్పుడు అతనికి సహకరిస్తూ చీకట్లోకి నెట్టేసే కొన్ని మూల పాపాలు మూల కారణాలుగా విజృంభిస్తాయి.
అందులో ముఖ్యమైన ఏడు మూల పాప కారణాలు అహంకారం, కోపం, మోహం, లోభం, భోజన ప్రియత్వం, మత్సరం, సోమరితనం. ఈ ఏడూ పరస్పర సహకారకాలు. ఇవి మనిషిని పతనానికి పడదోస్తాయి. ఇందుకు భిన్నంగా మరో ఏడు కారణాలు, ఓ మనిషిని నీతిమంతంగా కనిపించడానికి, పుణ్య కార్యాలు చేయడానికి ప్రోత్సహిస్తాయి. అవి పుణ్య మూలకారణాలు. దీనత, ఓర్పు, విరక్తత, ఉదార స్వభావం, మిత భోజనం, పరస్నేహం, చురుకుదనం ఇవి ఆ ఏడు పుణ్య మూల కారణాలు. మొదటగా పేర్కొన్న దుర్గుణాలు ఏ రకమైన కష్టమూ లేకుండానే ఓ మనిషికి సంక్రమిస్తాయి. సుగుణాలు మాత్రం అలవోకగా అలవడవు. కాస్త ఓపికగా కష్టంతోనైనా అలవరచుకోవలసిన అవసరం ఉంది. ప్రభువును ఆశ్రయించి.. దుర్గుణాలను త్యజించాలి. ఆ ప్రభువు మార్గాన్ని అర్థం చేసుకుంటూ సద్గుణాలను సంపాదించుకోవాలి.