తిరుమల : వేసవి సెలవులు ముగిసిపోవడంతో పాటు వారాంతం రావడంతో తిరుమల ( Tirumala ) లో అనూహ్య రద్దీ నెలకొంది. దీంతో అధిక మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు ( VIP break darshans ) చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ లో ఏరోజుకారోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల జారీని కూడా సోమవారం రద్దు చేశామన్నారు.
ఈ విషయాన్ని గమనించి భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ సీనియర్ అధికారులందరూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.
85,582 మంది దర్శనం
ఇటీవల కాలంలో శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 85,582 మంది శ్రీవారిని దర్శించుకోగా 44,155 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.76 ఆదాయం వచ్చిందన్నారు. 4.66 లక్షల లడ్డూలను విక్రయించగా 3.43 లక్షల మంది అన్నదానం స్వీకరించారని వివరించారు.