HomeDevotionalVinayaka Chavithi Special Different Type Of Ganesh Temples Across India
Vinayaka Chavithi 2025 | అరుదైన రూపాల్లో వినాయకుడు.. ఈ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి విశిష్టతేంటి?
Vinayaka Chavithi 2025 | వినాయక చవితి సందర్భంగా గణేశ్ నవరాత్రుల సమయంలో మాత్రమే కాదు వినాయకుడు విశిష్ట రూపాల్లో కనిపించే ఆలయాలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఆ క్షేత్రాలు, వాటి విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం..
Vinayaka Chavithi 2025 | వినాయక చవితి వచ్చేసింది ! ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుతీరేందుకు గణేశుడి ప్రతిమలు సిద్ధమైపోయాయి. పోలీసుగా.. జవానుగా.. కర్షకుడిగా.. వైద్యుడిగా.. ఇలా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు గణేశుడు రెడీ అయిపోయాడు. ఇలా విభిన్న ఆకారాల్లో కేవలం గణేశ్ నవరాత్రుల సమయంలో మాత్రమే కాదు వినాయకుడు విశిష్ట రూపాల్లో కనిపించే ఆలయాలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. మరి విభిన్న ఆకారాల్లో గణనాథుడు కొలువైన క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి విశిష్టత ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం వినాయకుడి గురించి అందరికీ తెలిసిందే. బావిలో ఉండే ఇక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి విఘ్నేశుడు.. సత్యప్రమాణాల దేవుడిగా ప్రతీతి. ఇక్కడ ప్రమాణం చేసి చెప్పిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు కూడా పరిగణనలోకి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
శ్వేతార్క గణపతి
శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. ఆ వేరులో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడని ప్రతీతి. ఎప్పుడైనా తెల్ల జిల్లేడు వేళ్లను పరిశీలించండి. అవి అచ్చం గణేశుడి ఆకారంలో కనిపిస్తాయి. వరంగల్ జిల్లా కాజీపేట పట్టణంలో రైల్వే దేవాలయం కాంప్లెక్స్‌లో ఉన్న గణపతి దేవాలయం శ్వేతార్క గణపతి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయంలో ఉన్న గణపతి విగ్రహం స్వయంభువుగా వెలిసింది. చెట్టు నుంచి ఉద్భవించిన ఈ వినాయకుడి కళ్లు, నుదురు, వక్రతుండం, దంతాలు, కాళ్లు, పాదాలు, అరచేయి, ఆసనం, మూషికం అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఇక్కడి గణపతిని సంపూర్ణ శ్వేతార్క మూలగణపతిగా వ్యవహరిస్తారు.
వినాయకుడి ఒడిలో శ్రీకృష్ణుడు
పురాణాల ప్రకారం పార్వతీదేవికి శ్రీ మహావిష్ణువు సోదరుడి వరుస అవుతాడు. వినాయకుడు పార్వతీదేవి కుమారుడు అంటే శ్రీమహావిష్ణువుకు మేనల్లుడు అవుతాడు. ఇక శ్రీకృష్ణుడు.. శ్రీ మహావిష్ణువు అంశ. అంటే గణపతికి శ్రీకృష్ణుడు మేనమామ అవుతాడు. ఈ మేనమామ బాలకృష్ణుడి రూపంలో మేనల్లుడి ఒడిలో కూర్చొని భాగవతం వింటున్న అపురూప దృశ్యం నిజంగా అద్భుతం కదా! ఈ అద్భుతాన్ని కేరళలోని కొట్టాయం సమీపంలోని మళ్లియూర్ పుణ్యక్షేత్రంలో చూడవచ్చు. అయితే ఈ ఆలయం ప్రసిద్ధి చెందడానికి శంకరన్ నంబూద్రియే ముఖ్య కారణం. గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామాన్ని పెట్టుకుని శంకరన్ నంబూద్రి పూజిస్తుండేవాడు. నిత్యం భాగవతం పారాయణం చేస్తుండేవాడు. ఒకనాడు ఆయన పూజలో ఉండగా.. వినాయకుడి విగ్రహంలో బాలకృష్ణుని రూపం గోచరించింది. దీంతో ఆయన చూసిన దృశ్యానికి ఒక విగ్రహంగా చెక్కాడు. ఆ విగ్రహమే ఇప్పుడు ఈ ఆలయంలో ప్రధాన విగ్రహంగా పూజలందుకుంటుంది. వినాయక చవితి రోజు ఆ ఆలయంలో చతుర్ధియాటు అనే పితృదోష పరిహార పూజలు జరుపుతారు. సంతాన భాగ్యం కోసం పాలు, పాయసం నివేదించి పూజిస్తారు. తులాభార మొక్కులు కూడా తీర్చుకుంటారు.
విజయ వినాయకి
పురుష దేవుళ్లు స్త్రీరూపం దాల్చినట్టుగా పురాణ కథల్లో కనిపిస్తుంది. వినాయకుడు కూడా స్త్రీశక్తిగా అవతరించాడని చెబుతారు. గజానని, వినాయకి, విఘ్నేశ్వరిగా ఆ మూర్తిని కొలుస్తారు. ఇందుకు నిదర్శనంగా తమిళనాడులోని పలు ఆలయాల కుడ్యాలపై స్త్రీమూర్తిగా ఉన్న గణపతి మూర్తులు దర్శనమిస్తాయి. ఆ రాష్ట్రంలోని సుచీంద్రం ఆలయంలో వినాయకి విగ్రహం చూడొచ్చు. పురాణాల్లోనూ వినాయకి ప్రస్తావన కనిపిస్తుంది. పరమేశ్వరుడు అంధకాసురుడిని వధించే సమయంలో ఆ అసురుడి రక్తబిందువులు దేవతలపై పడి, ఆయా పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాయట. అలా వినాయకుడి నుంచి వినాయకి వచ్చిందని చెబుతారు. స్త్రీరూప వినాయకుడు 64 మంది యోగినులలో ఒకరని కూడా చెబుతారు.
మధుర్ మహాగణపతి ఆలయం
కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని కాసర్ గోడ్ జిల్లాలోని మధుర్ గ్రామంలోని శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజల విశ్వాసం. ఈ ఆలయ ఆవిర్భావం, చరిత్ర రెండూ విశేషమే. ఈ ఆలయంలో ప్రధాన మూల విరాట్టు పరమేశ్వరుడు. ఇక్కడ శివుడి విగ్రహం స్వయంభువుగా వెలిసిందని చెబుతుంటారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఆలయ పూజారి కుమారుడు ఈ శివాలయానికి వచ్చాడు. అడుకుంటూ ఆడుకుంటూ గర్భగుడిలోకి వెళ్లిన ఆ పిల్లాడు అక్కడి గోడపై వినాయకుడి ప్రతిరూపాన్ని చెక్కాడు. ఆ తర్వాత ఆ బొమ్మ నుంచి వినాయకుడి రూపం ఆవిర్భవించడం మొదలైంది. అయితే ఈ గణపతి విగ్రహం నానాటికీ పెరగడాన్ని మధుర అనే ఒక స్త్రీ కనుగొన్నది. దీంతో ఆమె పేరు మీదుగానే ఈ ఆలయం మధుర్ మహాగణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహాన్ని మధుర తొలిసారిగా చూసింది కాబట్టి.. అప్పటి నుంచి ఆ ఆలయంలో తొలి దర్శనం మహిళలకే కల్పిస్తుండటం విశేషం. ఇక్కడి గణపతికి అప్పాలు అంటే చాలా ఇష్టమంట. అందుకునే స్వామివారిని దర్శించుకుని అప్పాలను సమర్పిస్తే ఎలాంటి విఘ్నాలు అయినా చిటికెలో తీరిపోతాయని అంటారు. సహస్రాప్పం పేరుతో వేయి అప్పాలను నివేదించే ఆచారం కూడా ఇక్కడ ఉంది.
త్రినేత్ర గణపతి
గణనాథుడికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారని పురాణ గాథలు చెబుతుంటాయి. కానీ ఏ ఆలయంలో చూసినా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతో కనిపించే ఆలయాలు చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఒకటుంది. అదే రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్ కోటలో ఉన్న త్రినేత్ర గణపతి ఆలయం. రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతుడిగా చరిత్ర అభివర్ణిస్తోంది. క్రీస్తు శకం 1299లో రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్య భీకర యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికులకు అవసరమైన ఆహారాన్ని, ఇతర సరుకులను కోటలోని ఒక ఆలయంలో నిల్వ చేశారు. అయితే ఈ యుద్ధం దాదాపు ఏడాది పాటు కొనసాగింది. దీంతో నిల్వ చేసిన సరుకులు మొత్తం నిండుకున్నాయి. అప్పుడు హమీర్‌కు ఏమి చేయాలో పాలుపోలేదు. అదేవిషయమై ఒకరోజు మథనపడుతూ నిద్రపోతుండగా వినాయకుడు ఆయన కలలోకి వచ్చాడు. మరుసటి రోజు పొద్దునకల్లా అన్ని సమస్యలు తీరిపోతాయని అభయమిచ్చాడు. తెల్లారి కోటలో చూడగా.. ఒక గోడపై మూడు నేత్రాలు ఉన్న వినాయకుడి ఆకృతి కనిపించింది. ఆ తర్వాత ఖిల్జీ సేనలు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆశ్చర్యంగా కోటలోని గోదాములన్నీ కూడా సరుకులతో నిండి ఉన్నాయి. దీంతో ఏకదంతుడే తమ రాజ్యాన్ని కాపాడాడని హమీర్ విశ్వసించాడు. క్రీ.శ.1300వ సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్వామిని కొలిస్తే విద్య, విజ్ఞానాలతో పాటు సంపదను, సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం.
శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్
ఆరు నెలలకు ఒకసారి తన రంగు మార్చుకునే వినాయకుడి గురించి ఎప్పుడైనా విన్నారా? తమిళనాడులోని నాగర్ కోయిల్ జిల్లా కేరళపురంలోని ఓ ఆలయంలో వినాయకుడు రంగులు మార్చుకుంటాడు. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయంలోని గణపతి మార్చి నుంచి జూన్ వరకు నల్లని రంగులో ఉంటాడు. జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెలుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని బావి కూడా ఇలాంటి మహత్మ్యమే ఉంది. ఇక్కడి వినాయకుడు తన రంగును మార్చుకున్నట్టే.. ఈ బావిలోని నీరు కూడా రంగు మారుతుంది. గణేశుడు తెలుపు రంగులో ఉన్నప్పుడు బావిలో నీరు నలుపు వర్ణంలో కనిపిస్తాయి. అదే పార్వతీపుత్రుడు నలుపు రంగులో కనిపిస్తే.. బావిలో నీరు తెలుపు రంగులో కనిపిస్తాయి. అంతేకాదు ఈ ఆలయంలోని మర్రి చెట్టు శిశిర రుతువుకు బదులు.. దక్షిణాయణంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయగర్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఏ కోరికతోనైనా భక్తులు ఈ ఆలయంలో కొబ్బరికాయ గానీ, బియ్యపు మూట గానీ ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని ప్రతీతి.
దొడ్డ గణపతి
బెంగళూరులోని బసవనగుడి బుల్ ఆలయం పక్కనే దొడ్డ గణపతి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి, శక్తి గణపతి అని పిలుస్తుంటారు. వారంలో అన్ని రోజులు ఇక్కడ విఘ్నేశుడికి పూజలు చేసి రకరకాల అలంకరణలు చేస్తుంటారు. ఈ అలంకరణలో ముఖ్యమైనది వెన్నతో అలంకరించడం. ఈ భారీ గణేశుడిని వెన్నతో అలంకరించేందుకు 100 కేజీలకు పైగా వెన్న అవసరం పడుతుందట. వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి.
మూడు తొండాల గణపతి
మూడు తొండాలు, ఆరు చేతులు ఉన్న వినాయకుడిని ఎప్పుడైనా చూశారా! మహారాష్ట్ర పుణేలోని సోమ్వార్ పేట్ జిల్లాలోని నజగిరి నదీ తీరంలో.. ఇలా మూడు తొండలు ఉన్న త్రిశుండ్ గణపతి దేవాలయం ఉంది. ఇక్కడి ఆలయంలో వినాయకుడు నెమలి వాహనంపై ఆసీనుడై ఉంటాడు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థి, వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.