Vinayaka Chavithi 2025 | హిందూ మతంలో వినాయక చవితి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం, పూజించడం ఒక ముఖ్య ఆచారం. ఈ వేడుకలో విగ్రహం ఎంపిక, ప్రతిష్టాపన విధానం చాలా ముఖ్యం. సాధారణంగా పర్యావరణానికి హానికరంలేని మట్టి విగ్రహాలను ఎక్కువగా ఇష్టపడతారు. వీటిని సులభంగా నిమజ్జనం చేయవచ్చు. కానీ, మట్టి విగ్రహాల కాకుండా ఇత్తడి, రాగి లేదా పంచధాతు విగ్రహాలను కూడా ఇంటికి తీసుకురావడం శుభంగా పరిగణించబడుతుంది. వినాయక చవితి సందర్భంగా చాలా మంది మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని తీసుకుంటారు. అయితే వివిధ లోహాల విగ్రహాలు కూడా పవిత్రంగా భావిస్తారు. ఇలా విగ్రహం తీసుకురావడం వల్ల పనిలో ఆటంకాలు తొలగి, ఇంట్లో సంపద నిలుస్తుంది. ఇంటి సైజు ప్రకారం విగ్రహ పరిమాణం తీసుకోవడం మంచిది. చాలా పెద్ద లేదా చిన్న విగ్రహాలు తీసుకోవద్దు. అయినా ఇష్టమైన భంగిమలో విగ్రహం తీసుకురావచ్చు.
ఈ ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు. వినాయక చతుర్థి తిథి ఆగస్టు 26 తేదీ మధ్యాహ్నం 1:54 గంటలకు మొదలై, ఆగస్టు 27 తేదీ మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఆగస్టు 27వ తేదీ ఉదయం 5:20 నుంచి 7:20 వరకు సింహ లగ్నం ముహూర్తం ఉంది, ఇది గణపతి పూజకు అత్యంత శుభకర సమయం అని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో దీపం వెలిగించి పూజ ప్రారంభించడం మంచిది. ఉదయం పూజ చేయలేని వారు వృశ్చిక లగ్నం అయిన ఉదయం 11.05 నుంచి 11.50 మధ్య వినాయక వ్రత కల్పం చేయడం కూడా అత్యంత శుభకరంగా పరిగణిస్తారు. ఈ సమయంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, నియమ నిష్టలతో పూజ నిర్వహించడం ద్వారా గణనాథుడి అనుగ్రహం పొందవచ్చని పండితులు తెలిపారు. పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్టించి పూజించడం మరింత శ్రేయస్కరంగా పేర్కొంటారు.
విగ్రహాన్ని ఉదయం లేదా మధ్యాహ్నం శుభ సమయంలో ఇంటి ఉత్తరం లేదా తూర్పు దిశలో ప్రతిష్టించాలి. ప్రతిష్టాస్థలాన్ని శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉంచాలి. ఒక అలంకరించిన మంటపాన్ని ఏర్పాటుచేసి, కలశం లో గంగాజలం, కుంకుమ, అక్షతలు, నాణేలతో పాటు మామిడి ఆకును పెట్టాలి. ఆపై విగ్రహం పాదాల దగ్గర దీపం వెలిగించి, గంగాజలంతో స్నానం చేసి, ధూప దీపాలు, నైవేద్యాలు సమర్పించి గణేష్ స్తోత్రం పఠించాలి. పూలతో అలంకరించి తిలకం పెడుతూ గణేశుని ఆశీస్సులు పొందాలి. విగ్రహానికి పూలు, నీటిని క్రమం తప్పకుండా అందించాలి. రంగుల విషయంలో కొత్త విగ్రహం తెల్లగా ఉండేలా చూడాలి. ఇది శాంతి, శ్రేయస్సుకు సూచిక. ఎడమ వైపు తొండం వొంపు ఉన్న విగ్రహం తీసుకురావడం ఐశ్వర్యం, సంతోషం ఇస్తుంది. విగ్రహ ప్రతిష్టాపనకు ఉత్తరం, తూర్పు, ఈశాన్య మూలాలు మంచి దిశలు. కూర్చున్న భంగిమలో లేదా లలితాసనంలో విగ్రహం ఉంచడం శాంతి, సౌకర్యం కలిగిస్తుంది. ఈ విధంగా వినాయక చవితి పండుగను సక్రమంగా జరుపుకోవడం ద్వారా సంతోషం, సమృద్ధి, శాంతి కలుగుతుందని నమ్మకం.