చదువుల తల్లి పుట్టినరోజు వసంత పంచమి పర్వదినం. ‘యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్ర్తాన్వితా..’ అని మనం కొలుచుకున్నట్టు అమ్మవారు తెల్లటి వెన్నెలలా మెరిసే శుద్ధ సాత్విక రూపిణి. నిజానికి సరస్వతి అన్న పదానికి ‘ప్రవహించే జ్ఞానం’ అన్న అర్థం కూడా ఉంది. మాఘ శుక్ల పంచమి నాడు అమ్మవారిని కొలిస్తే అపారమైన జ్ఞాన సంపదను ప్రసాదంగా ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
వేదవాఙ్మయంలో ఎన్నో సరస్వతీ ప్రార్థనలున్నాయి. రుగ్వేదం రకరకాల సరస్వతీ సూక్తాలను పొందుపరిచింది. అసలు వేదాలే సరస్వతీ మాత నుంచి వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ చెబుతుంది. అందుకే అప్పుడే అక్షరాలు దిద్దుకుంటున్న బిడ్డలకు వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించే ఆనవాయితీ ఉంది. తల్లీ నిన్ను దలంచి.. అంటూ అమ్మకు మొక్కి పలక పట్టించడం మన దగ్గరి విశిష్ట సంప్రదాయం.
వసంత మాస ఆగమనాన్ని సూచించేదిగా మాఘ శుక్ల పంచమిని వసంత పంచమిగా కూడా జరుపుకొంటారు. దీనికే సరస్వతీ జయంతి, శ్రీ పంచమి అన్న పేర్లూ ఉన్నాయి. ఈ సమయంలో అటు చలికాలమూ కాకుండా ఇటు ఎండాకాలమూ కాకుండా హాయిగొలిపే వాతావరణం ఉంటుంది. అంతేకాదు, లేలేత చిగుళ్లు, అందమైన పూలు ఈ కాలపు ప్రత్యేకతలు.
అందుకే దీన్ని మదన పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు రతీమన్మథుల్ని పూజిస్తారు. ఉత్తరాదిలో ఈ రోజు రంగులు చల్లుకుని ఆడిపాడే సంప్రదాయమూ ఉంది. వసంతం అంటేనే సంతసాన్ని పంచేది. దానికి ఆహ్వానం పలికే ఈ రోజు ఆనందానికి మహాద్వారం లాంటిది. అమ్మ కృప కలిగితే అపార జ్ఞానానికి ఆది అడుగూ ఇదే!
– శ్రీ