భాషలు ఒకటా రెండా లేక మూడా
వేలాది భాషల మనుగడలో
అది చాలా చిన్న లెక్క
రాజకీయ సంవాదం ఆధిపత్య ఆరాటం
నిజానికి ‘భాష’
మాటల సందడి కాదు, శబ్ద సమూహమూ కాదు
అది ఆలోచనల ప్రవాహం, భావాల ప్రయాణం
భాష స్తబ్ధత నిండిన శిల కాదు, నిరంతర చలనశీలి
అది ఏకరూపి కాదు, బహురూపి
స్థలానికీ స్థలానికీ భాష మారుతుంది
స్వరానికి స్వరానికి యాస మారుతుంది
నాలుగడుగులు వేస్తే నడకా మారుతుంది
కుందేలు వేగం జింక హొయలు హంస నడక
పక్షి పయనం భాషకు సొంతం
అది ఎంత సున్నితమో అంత కఠినం
ఆర్తి ఆవేదన ఆవేశం ఆరాధన అభిమానం
భాష అన్నింటినీ ధ్వనిస్తుంది ప్రతిధ్వనిస్తుంది
ప్రకృతిలో
చినుకులు చిగురిస్తాయి వానలు దంచేస్తాయి
వరదలు ముంచేస్తాయి ఉప్పెనలు ఊడ్చేస్తాయి
కన్నీళ్లు కరిగిస్తాయి అవి అన్నీ నీళ్ళే
‘భాషా’ అంతే
భాషా నీళ్ళూ, కన్నీళ్ళూ దగ్గరి చుట్టాలు
మనిషి అనే చెట్టుకు వేరు మాతృభాష
ఇతర భాషలెన్నయినా కొమ్మలే
కొమ్మలెన్ని పెరిగినా
వేరు తెగితే చెట్టే కూలిపోతుంది
రాజకీయాలు ఎన్ని భాషల్లోనైనా మాట్లాడొచ్చు
భాషనే రాజకీయం చేస్తే
సృజనకు స్వస్తి పలికినట్టే
భవిష్యత్తుకు మంగళం పాడినట్టే
ఎవడి భాషలో వాడు ఎవడి యాసలో వాడు
పలికినప్పుడే
మనిషికి మనుగడ దేశానికి నిలకడ
భవిష్యత్తుకు భరోసా