శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు, అభిషేకలు వైభవంగా నిర్వహించినట్లు ఈవో లవన్న పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాకారంలో స్వామిఅమ్మవార్లను పల్లకీలో ఆశీనులజేసి, పూజలు చేశారు. ఆ తర్వాత గిరిప్రదక్షిణ నిర్వహించారు. అర్చక వేదపండితులు భక్తులు శివనామస్మరణ చేస్తూ నందిమండపం నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా శివనామస్మరణ చేస్తూ సాగిన గిరిప్రదక్షిణలో యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పౌర్ణమి సంధ్యా సమయంలో భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసి ఊయల సేవ, పల్లకీ సేవ జరిపించారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి అష్టోత్తర నామావళిని అర్చకులు పఠించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు ఉత్సవం జరిపించారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలో భక్తులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏఈవో హరిదాసు తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న పరోక్షసేవకు విశేష ఆదరణ లభిస్తుందని ఈవో అన్నారు. నిత్య ఆర్జిత సేవలతోపాటు ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారికి జరిపే లక్షకుంకుమార్చనలో భక్తులు తమ గోత్రనామాలను ముందుగా నమోదు చేయించుకుని అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని పొందుతున్నారని తెలిపారు. భక్తులు www.srisailadevasthanam.org ఆన్లైన్ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఈవో లవన్న కోరారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం తెల్లవారుజామునుండే భక్తులు బారులుదీరారు. సామూహిక అభిషేకాలు, గర్బాలయ అభిషేకాలు, వృద్దమల్లికార్జునస్వామి వారి బిల్వార్చనలు, అమ్మవారి కుంకుమార్చనలలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేవస్థానం నిర్వహించే టికెట్ కౌంటర్లలో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే నిర్వహిస్తుండడంతో టికెట్ల కొనుగోలుకు సరిపడ నగదు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్ర పరిధిలో వివిధ బ్యాంకులు నిర్వహిస్తున్న ఏటీఎంలు పనిచేయకపోవడంతో యాత్రికులు తమకు కావాల్సిన ఆర్జిత సేవా టిక్కెట్లను పొందలేకపోతున్నామని పలువురు ఆరోపిస్తున్నారు. దేవస్థానం అధికారుల ఈ సమస్యలను అధిగమించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని కోరుతున్నారు. శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని పీఆర్వో శ్రీనివాసరావు చెప్పారు.