న జాయతే మ్రియతే వా విపశ్చిత్
నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్
అజో నిత్యః శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే
(కఠోపనిషత్ రెండో వల్లి- 18)
‘ఈ ఆత్మ జన్మించదు, మరణించదు, దేనినుంచీ ఆత్మ ఉద్భవించలేదు. ఆత్మనుంచి ఏదీ ఉద్భవించలేదు. జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది అయిన ఆత్మ తన దేహం హత్యకు గురైనా, అది మరణానికి గురికావడం లేదు’ అని నచకేతునికి యముడు ఆత్మ తత్వాన్ని విశదీకరించాడు.
సాందీపుడి దగ్గర విద్యనభ్యసించారు బలరామకృష్ణులు. విద్యాభ్యాసం పూర్తయ్యాక గురు దక్షిణను సమర్పించుకుంటామన్నారు. ప్రభాస తీర్థంలో సముద్రంలో మునిగి మరణించిన తమ పుత్రుని తిరిగి బతికించుమని కోరారు సాందీపుడు. బలరామకృష్ణులు సముద్రతీరాన్ని చేరి గురుపుత్రుని తిరిగి ఇవ్వమని అడిగారు. సముద్రుడు ప్రత్యక్షమై నమస్కరించి.. ‘పంచజనుడనే దైత్యుడు సముద్ర గర్భంలో శంఖరూపంలో ఉన్నారు. మీ గురుపుత్రుణ్ని అతనే మింగాడు. ఆ పిల్లవాడు వాని గర్భంలోనే ఉండవచ్చు’ అన్నాడు. కృష్ణుడు సాగరంలోకి ప్రవేశించి పంచజనుని వధించాడు.
కానీ, ఆ దైత్యుని ఉదరంలో గురుపుత్రుడు కనపడలేదు. కృష్ణుడు శంఖ రూపంలోని ఆ అసురుని తీసుకొని బయటికి వచ్చాడు. తన అగ్రజునితో కలిసి యముడి సంయమిని నగరానికి చేరుకొని శంఖాన్ని పూరించాడు కృష్ణుడు. యముడు వచ్చి నమస్కరించి బలరామకృష్ణులను భక్తితో అర్చించాడు. తానేం చేయాలో అడుగగా.. గురుపుత్రుణ్ని తిరిగి ఇచ్చివేయమన్నారు. అదే పరమోత్కృష్టమైన ఆజ్ఞగా భావించి.. ఆ బాలుణ్ని తెచ్చి వారికి అప్పగించాడు యముడు. ఆ బాలుణ్ని తండ్రి చెంతకు చేర్చారు. ‘మరేదైనా కోరిక ఉన్నదా గురువుగారు’ అని అడిగారు ఇద్దరు. ‘నేను పూర్తిగా సంతుష్టుణ్నయ్యాను. మీ వంటి శిష్యులుంటే కోరేది ఏముంటుంది?’ అన్నాడు. ఈ ఉదంతం ద్వారా శాశ్వతమైన ఆత్మకు కృష్ణ భగవానుడు శరీరాన్ని తొడిగాడు అని చెప్పవచ్చు.
…? డా॥ వెలుదండ సత్యనారాయణ