శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Mar 24, 2020 , 16:51:27

ఉగాది పచ్చడి తయారు చేయడం ఎలా?

ఉగాది పచ్చడి తయారు చేయడం ఎలా?

ఉగాది.. అంటేనే పచ్చడి పండుగ అని పేరు. షడ్రుచుల మేళవింపుతో తయారుచేసే పచ్చడి కేవలం ఆధ్యాత్మికతే కాదు. దీనివెనుక సైన్స్‌ కూడా ఉంది. శరీరంలోని టాక్సిన్‌లను దూరం చేయడంలో ఈ పచ్చడి ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ పచ్చడిలో ఏయే పదార్థాలు ఎంత పాలులో కలపాలి అనేది తెలియక చాలామంది ఏదో ఒకలా అన్నట్లు పచ్చడి చేసుకుంటారు. కానీ దీనికి ఒక లెక్క ఉంది ఆ వివరాలు తెలుసుకుందాం....

ఉగాది పచ్చడి తయారీ విధానం- అవసరమై పదార్ధాలు:  

మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది)- 1

వేపపువ్వు- 1/2 కప్పు

సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు

కొత్త చింతపండు- 100 గ్రాములు

కొత్త బెల్లం- 100 గ్రాములు

మిరపకాయలు- 2

అరటిపండు - 1

చెరకు రసం -1/2 కప్పు 

ఉప్పు - సరిపడేంత

నీళ్లు, అవసరమైతే అరటి పళ్లు, జామకాయలను కూడా వేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల వారు వారి ప్రాంతీయ ఆచారాలను బట్టి పైన పేర్కొన్నవే కాకుండా వేరేవి కలుపుతారు. 

తయారు చేసే విధానం:  ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. ఈ మిశ్రమంలో మామిడి కాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే. ఇక వసంత రుతువును లక్ష్మీ స్వరూపంగా, ఇష్టదేవత, కులదేవతలను ఆహ్వానించి పూజ చేయాలి. నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత స్వీకరించాలి. అంతేకాదు మిగతా వాళ్లకు అందజేయండి. కష్ట సుఖాలను జీవితంలో చవిచూడాలనే నిజాన్ని ఉగాది పచ్చడి సేవనం తెలియజేస్తుంది. ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఇలా అన్ని ఆయా పాళ్లలో వేస్తే ఉగాది పచ్చడి రుచికరంగా ఉంటుంది. 


logo