తిరుపతి : దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ( TTD ) ఆలయాల్లో భక్తులు సులభతరంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుగా కియోస్క్ మిషన్లు ( Kiosk Missions) , క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్( EO Anil Kumar Singhal ) ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వెనుకబడిన ప్రాంతాల్లో టీటీడీ నిర్మించదలచిన ఆలయాలకు అవసరమైన రెండు, మూడు డిజైన్లు సిద్ధం చేయాలని సీఈని ఆదేశించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. తిరుపతిలోని వినాయక నగర్ వద్ద ఉన్న టీటీడీ స్టాఫ్ క్వార్టర్స్ ఆధునీకరణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను కూడా వేగవంతం చేయాలన్నారు.
కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు.శ్రీవారి ఆలయం లో ఉన్న కదిలే వంతెన మరమ్మతు పనులను వైకుంఠ ఏకాదశిలోపు పూర్తి చేయాలని సూచించారు. ముంబైలోని బాంద్రా ఆలయంలో జేఈవో, చీఫ్ ఇంజనీర్,సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కర్ణాటకలోని బెలగావిలో ఆలయం నిర్మాణం, బీహార్లోని పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపుపై ఆయా అధికారులతో సంప్రదించి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.