తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించిన మీదట త్వరలో తిరుపతిలో దివ్వ దర్శనం టోకెన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తామని ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. జూలై 7వ తేదీ సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదలచేశామని, వాటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చునని సూచించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ధర్మారెడ్డి సమాధానాలు ఇచ్చారు.
కాషన్ డిపాజిట్ 12 గంటల్లోపు టీటీడీ నుంచి ఫెడరల్ బ్యాంక్‌కు చేరుతుందని, అక్కడి నుండి భక్తుల అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు రెండు రోజుల్లో జమవుతుందని తెలిపారు. తిరుమలలో 7 వేల గదులు మాత్రమే ఉండగా, 20 వేల మందికి మాత్రమే వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. 50 శాతం గదులు అడ్వాన్స్ రిజర్వేషన్ కింద, మిగిలినవి నేరుగా వచ్చి పేర్లు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కేటాయిస్తున్నామన్నారు.తిరుమలలో వసతి కొరకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం మంచి పద్ధతి అని తెలిపారు.
టీటీడీ యాప్‌లో దర్శనం టిక్కెట్ల నిమిత్తం ఇటీవల జియో సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని, త్వరలోనే నూతన యాప్ భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చి ఆన్లైన్ దర్శనాలు, సేవ టికెట్లు, వసతి బుక్ చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో 100 శాతం ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తులు చెప్పులు లేకుండా నడవలేకపోతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, భక్తుల సౌకర్యార్థం లగేజీ మాదిరిగానే చెప్పులు కూడా తీసుకునేలా చర్యలు తీసుకోనున్నామన్నారు.
శ్రీవారి లడ్డు మరింత రుచికరంగా ఉండేందుకు సేంద్రియ వ్యవసాయంతో పండించిన ముడి పదార్థాలు వినియోగించాలని టీటీడీ నిర్ణయించిందని ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే 500 క్వింటాళ్ల వేరుశనగలు, ఇతర ముడి పదార్థాలను కొనుగోలు చేశామని చెప్పారు. తిరుమలలో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
రెండేండ్ల తర్వాత మాడ వీధుల్లో..
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు జరుగనున్నాయని, కరోనా అనంతరం రెండేండ్ల తర్వాత మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనున్నదని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 1న గరుడ వాహనం, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగనున్నాయని ధర్మారెడ్డి చెప్పారు. కరోనా కారణంగా తిరుమలలో కొంత కాలంపాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్టు 1 నుంచి తిరిగి ప్రారంభం కానున్నదని వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి జానపద కళాకారులు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారన్నారు.