తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Brahmotsavam ) గురువారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానం(Chakrasnanam) ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ( EO Anil Kumar Singal ) తనిఖీలు చేశారు. పుష్కరిణి ప్రాంతంలోని నలువైపులా జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీ ఎస్వో కె.వి.మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తామని వివరించారు.
చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చేశారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాలని, భక్తులు సంయమనం పాటించి టీటీడీకి సహకరించాలన్నారు. టీటీడీ సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీలలోని భక్తులు దశలవారీగా పుష్కరిణిలోకి ప్రవేశించాలని కోరారు.
చక్రస్నానం సందర్భంగా వెయ్యి మంది పోలీసులు, 1,300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో, ఎన్డీఆర్ఎప్, ఫైర్, తదితర విభాగాల నుంచి140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు.