అపోస్తుల చర్యలు మహత్కార్యాలుగా కనిపిస్తాయి. పునరుత్థాన క్రీస్తు నలభై రోజులపాటు అక్కడే ఉన్నాడు. శిష్యులు ఏమేం చేయాలో దిశా నిర్దేశం చేశాడు. లూదియా, సమరియా, జెరూషలేం ప్రాంతాలంతటా సువార్త ప్రకటించమని ఆదేశించాడు. ప్రభువు లక్ష్యం, దేవుని సంకల్పం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ‘ప్రభూ! మళ్లీ ఇశ్రాయేలీయ రాజ్య స్థాపన సాధ్యమా’ అని శిష్యులు ప్రభువును అడిగారు. ‘కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలుసుకొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు.
గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును ఈ సత్యసందేశాన్ని బహు శక్తిమంతంగా ప్రకటించగలరు’ అని ప్రభువు ఆదేశించాడు (అపో. కా. 1:7-8). ప్రభువుపై అఖండమైన విశ్వాసాన్ని నింపుకొని, ధైర్యాన్ని కూడగట్టుకొని, ఆ శిష్య అపోస్తులు ప్రజాహిత చర్యల కోసం ముందుకు సాగారు. గుంపులు గుంపులుగా చీలి, ఆ తరువాత తలోదిక్కుగా పయనించి తాము చేయవలసిన వాక్య బోధ ప్రారంభించారు.