దేశమంతటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహిస్తాం. విజయ దశమి (దసరా)తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారు విజయదుర్గా దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా పరిపూర్ణమైన నవదుర్గా స్వరూపిణిగా ఈ రోజు దర్శనమిస్తుంది.
అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా చాముండాశ్రిత రక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత ఆమె. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి.
యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్ఠాన దేవత. లలితా సహస్రనామ పారాయణాలతో, కుంకుమార్చనలతో కొలిచిన వారికి కొంగుబంగారమై అనుగ్రహిస్తుంది. ఏ శక్తి సకల సృష్టి, స్థితి, లయలకు, సమస్త చైతన్యానికి మూలమో ఆ శక్తినే నవరాత్రుల సందర్భంగా దివ్యంగా కొలుస్తారు. అన్ని విజయాలను ఇచ్చే శమీ వృక్షాన్ని పూజిస్తారు.
తెల్లదనం ఆత్మశుద్ధికి గుర్తు.
శరత్ రుతువులో అతిశీతలమూ, అతివేడిమీ కాని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. వర్ష రుతువు వెళ్లిపోయి, సరస్సులు, చెరువులు, నదులు మొదలైన జలాశయాలన్నీ నిండుగా కనిపిస్తాయి. ఆకాశం తెల్లని మేఘాలతో విలసిల్లుతూ స్వచ్ఛమైన వెన్నెల కురిపించే కాలమిది. శరత్ కాలం, శరత్ జ్యోత్స్న, శరత్ మేఘం, శారద చంద్రికలు వంటి పదాలన్నీ ఈ రుతువును శోభాయమానంగా వర్ణించేవే. శరత్ కాలం అంటేనే సస్యశ్యామలంగా ఫలపుష్పాలతో, పైరు పంటలతో పచ్చదనాన్ని పరచుకొన్న ప్రకృతి చైతన్యానికి సంకేతంగా నిలుస్తుంది.
నిర్మలమైన ఆకాశంలో చంద్రుడు అందంగా స్వచ్ఛంగా కనిపించే కాలం ఇది. స్వచ్ఛమైన గాలి, తేటదనం నిర్మలమైన మనసుకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే కవులను కళాకారులను ఊహలలో విహరింప చేసే కాలం ఇది. ప్రకృతి ఆనందంతో పులకరించిపోయే సమయం శరత్ రుతువు. పూర్వం రాజులు యుద్ధాలకు వెళ్లడానికి , విజయులై తిరిగి రావడానికి కూడా విజయదశమినే ముహూర్తంగా నిర్ణయించేవారు. ఈ విజయదశమి మనందరికీ విజయాలు కలిగించాలని కోరుకుందాం.
– మరుమాముల దత్తాత్రేయశర్మ