తిరుమల : తిరుమల ( Tirumala ) వేంకటేశ్వర స్వామి వివిధ దర్శనాలు, గదులకు సంబంధించి సెప్టెంబర్ (September ) నెలకు సంబంధించి కోటా వివరాలను టీటీడీ ( TTD ) వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వివరించింది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని వివరించారు. 22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు , 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు , ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేస్తామని వెల్లడించారు.
24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను విడుదల చేస్తామని వివరించారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.