Jyestabhishekam | తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడురోజుల పాటు తిరుమల జ్యేష్టాభిషేకం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. తరతరాలుగా అభిషేకాలతో శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990లో ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం రుత్వికులు శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గురువారం ముత్యపుకవచంతో, శుక్రవారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో జే శ్యామల రావు దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.