“ఋతం వచ్మి.. సత్యం వచ్మి’ సన్మార్గం ద్వారా నిజం పలుకుతున్నాను’ అని వేదం చెప్పిన మాట ఇది. ‘భూమ్యాకాశాల్లో ప్రకృతి పురుషమయంగా విస్తరించి, విశ్వమంతా కళ్లు, చెవులు, ముఖాలు, చేతులు, బాహువులు, పాదాలు కలిగి, అణువణువునా నిండి ఉన్న సర్వాంతర్యామి దైవం.
ఒకే పరమాత్మ ప్రాణాల నిగ్రహం కోసం వివిధ రూపాల్లో.. వారి వారి ఉపాసనాశక్తిగా విగ్రహరూపంలో పూజలు అందుకుంటున్నాడు. అలాంటి దేవతలలో ఆద్యుడు వినాయకుడు అని వేదమాత తెలియపరిచింది. ఆదివంద్యుడు, బ్రహ్మణస్పతి… వేదనాద గణపతి. తొలిదైవంగా వేద కాలం నుంచి ఈనాటి వరకు తరతమ భేదం లేకుండా ప్రణుతులు అందుకుంటున్నాడు. సుముఖునిగా, ఏకదంతునిగా, పరబ్రహ్మ పరమాత్మగా భాగవతోత్తములు వినాయకుణ్ని ఆరాధిస్తుంటారు. వినాయక చవితి సందర్భంగా గణేశుడి ఆరాధన దేశమంతా విశేషంగా కొనసాగుతుంది. మృణ్మయ మూర్తి నుంచి స్వర్ణమయ మూర్తి వరకు శక్తి కొలదీ ఆ విఘ్నరాజును ఆరాధిస్తారు భక్తులు. వివిధ పత్ర, పుష్ప, ఫలాలతో కొలుస్తారు.
‘లం’ పృథ్వీతత్వ బీజం. యోగశాస్త్రంలో మూలాధార చక్రం అధిష్ఠాన వేదమూర్తి గణపతి. అందుకే సామవేద మహావాక్యం ‘తత్-త్వం-అసి’ అని పొగిడింది. అంటే సృష్టికి మూలాధారం విశ్వవ్యాప్తమైన వినాయకుడే! సృష్టికర్త బ్రహ్మగా.. జ్ఞాన స్వరూపునిగా లోకంలో మానవులకు జ్ఞాన సాధన కోసం పరితపించేట్లు అనుగ్రహించే దైవం ఆయన. విష్ణువుగా.. వ్యాపకత్వం చేత దశదిశలూ రక్షిస్తున్నవాడూ ఆయనే! లయకారుడు రుద్రుడు కూడా ఆయనే అని వేదమాత ఉపదేశించింది. బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వరూపుడు వినాయకుడు. ముల్లోకాలకూ అధిపతి అయిన ఆయన సూర్యచంద్రులకు ప్రతీక. స్త్రీ-పురుష స్వభావుడు.
విఘ్న, అవిఘ్నములకు అధిపతి. అభయ వరప్రదాత. సకల వేదాల్లో ప్రథమునిగా పేరొందిన వినాయకుడి ఆరాధన విశేష ఫలాన్నిస్తుందని పెద్దలు పేర్కొన్నారు. గాణాపత్యం పేరుతో గణపతి ఆరాధన ఉత్తరాదిలో విశేషంగా కనిపిస్తుంది. ఇక వినాయక చవితి సందర్భంగా పల్లెపల్లెలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సంఘటిత శక్తిని చాటుతూనే, ఆధ్యాత్మిక వైభవాన్ని దేదీప్యమానం చేస్తాయి గణపతి నవరాత్రులు. మన తెలంగాణలో గణపతి కొలువై ఉన్న క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మహిమాన్విత క్షేత్రమే కామారెడ్డి పట్టణంలోని సంకష్టహర మహాగణపతి ఆలయం. వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడ విశేష అర్చనలు, హోమాది క్రతువులు జరుగుతాయి. ఈ పర్వం సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునే సంకష్టహర మహాగణపతి దర్శనం సకల శుభకరం. కామారెడ్డి పట్టణానికి హైదరాబాద్ నుంచి బస్సు, రైలు సౌకర్యం ఉంది.
– గంగవరం ఆంజనేయశర్మ 94404 62545