ఓ గ్రామంలోని గుట్ట మీద ఈశ్వరాలయం ఉంది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు ప్రతి పౌర్ణిమ రోజున అక్కడ చేరి పూజలు చేస్తారు. ఆలయ నిర్వాహకులు అతిథి ఉపన్యాసకులను పిలిపించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారు. వచ్చిన భక్తులు రాత్రంతా మేలుకుని భక్తి వాతావరణంలో కాలం గడుపుతుంటారు. భక్తులందరికీ స్థానికులు భోజన సదుపాయం కూడా ఏర్పాటుచేస్తారు.
ఓ పౌర్ణమి రోజు యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భోజన సమయం కావడంతో అందరికీ భోజనం వడ్డిస్తూ ఉన్నారు. ప్రవచనకర్త అందరినీ పలకరిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. చాలామంది తమకున్న ధర్మసందేహాలను ఆయన్ని అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. అయితే వంట పనికి వచ్చిన ఒక మహిళ ఓ మూలగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం గమనించాడు ప్రవచనకర్త.
ఆమె దగ్గరికి వెళ్లి ‘ఎందుకు ఏడుస్తున్నావ’ని అడిగాడు. ‘మా ఊరి మనిషి చనిపోయాడని తెలిసింది. అందుకని ఏడుస్తున్నాను’ అని బాధగా బదులిచ్చిందామె. వెంటనే ప్రవచనకర్త ఆమెను ‘ఇక్కడ వంట చేయడానికి పాత్రలు ఎక్కడివి?’ అని అడిగాడు. ‘ఇంతమందికి వంట చేయాలంటే పెద్ద పాత్రలు కావాలి కదా, మన ఇండ్లలో ఉండేవి సరిపోవు, అందుకని అంగడి నుంచి బాడుగకు తెచ్చాం’ అని సమాధానమిచ్చింది. ‘వీటితో పని అయిపోయాక ఈ పాత్రలను ఏం చేస్తారు?’ అని మళ్లీ ప్రశ్నించాడు.
‘శుభ్రం చేసి అంగడి వారికి తిరిగి ఇచ్చేస్తాం’ అని జవాబిచ్చింది. అప్పుడు ప్రవచనకర్త ‘వంట పాత్రల్ని బాడుగకు తీసుకువచ్చాం. వంటకి వాడుకున్నాం. వంట పని పూర్తి అయ్యాక తిరిగి వారికే ఇచ్చేస్తాం. మన శరీరం కూడా అంతే… మన శరీరాన్ని ఆశ్రయించిన ఆత్మ తన పని పూర్తి అయ్యాక చెప్పా పెట్టకుండా వెళ్లిపోతుంది. ఉండమన్నా ఉండదు. ఇది సహజమైన విషయం. రాజైనా, కూలీ అయినా అందరం పోయేవాళ్లే. కాకుంటే ముందూ, వెనుకా… అంతే! నదులు సముద్రంలో కలవడం సహజమే కదా. దానికి బాధపడటం ఎందుకు?’ అని ధైర్యం చెప్పాడు. కళ్లు తుడుచుకుని ఆమె అక్కడినుంచి కదిలింది.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు,93936 62821