తను గొప్ప ధనవంతుడనని గర్వించే ఓ ధనికుడు ఒక ఆశ్రమానికి వెళ్లాడు. గురువుతో మాట్లాడుతూ ‘నేనంటే మా గ్రామ ప్రజలకు ఎనలేని గౌరవం’ అని దర్పంగా చెప్పాడు. గురువు నవ్వి ఆశ్రమంలో మూడురోజులు సామాన్య సేవకుడిగా ఉండగలరా అన్నాడు. సరేనన్నాడు ధనికుడు. మొదటిరోజు డబ్బులేమీ ఇవ్వకుండా ఖాళీ సంచి చేతికిచ్చి ‘గ్రామానికి వెళ్లి ఉద్దెరకు సరుకులు తీసుకురమ్మ’ని చెప్పి పంపాడు. ధనికుడు గ్రామానికి వెళ్లాడు. ఆగర్భ శ్రీమంతుడు తమ దగ్గర ఉద్దెరకు సరుకు అడగటంతో దుకాణదారులు గొప్పగా భావించారు. పిలిచి మరీ అడిగిన సరుకులన్నీ ఇచ్చారు. ధనికుడు సంచి నిండా సరుకులతో ఆశ్రమానికి వెళ్లాడు. రెండో రోజూ అలాగే ఉద్దెరకు సరుకులు తెమ్మన్నాడు గురువు.
గ్రామానికి వెళ్లాడు ధనికుడు. మళ్లీ ఉద్దెరకు సరుకులు కావాలన్నాడు. ఎవరూ మొదటి రోజంత ఉత్సాహంగా సరుకులు ఇవ్వలేదు. ఆయన ఆర్థికంగా చితికిపోయాడేమో అని గుసగుసలాడారు కొందరు. మూడో రోజూ అలాగే సరుకులు తెమ్మన్నాడు గురువు. సంచి తీసుకొని భారంగానే బయల్దేరాడు ధనికుడు. ఆయన రాకను గమనించి చూసీచూడనట్లుగా వ్యవహరించారు దుకాణదారులు. ఎక్కడా అప్పు పుట్టకపోగా, పాతబాకీ ఇచ్చి కదలమని కొందరు గొడవ చేశారు. వారిని ఎలాగో అలా తప్పించుకొని ఆశ్రమానికి దిగాలుగా చేరాడు ధనికుడు. అతని వాలకం చూసి జరిగినదాన్ని గుర్తించిన గురువు ‘ఇప్పుడైనా గమనించావా… ఇన్నాళ్లూ నీ గ్రామ ప్రజలు గౌరవించింది నిన్ను కాదు! నీ వెనక ఉన్న ధన సంపదను’ అన్నాడు. ‘నిజమే.. ఖాళీ జేబుతో అంగడిలో నిలబడితే కానీ, నా విలువ నాకు తెలియలేదు. మనిషికి మంచితనమే నిజమైన సంపద’ అని గుర్తించాడు ధనికుడు.
…?ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821