రంభుడు దనువు అనే రాజు కొడుకు. అగ్ని వర ప్రభావంతో రంభుడికి, ఒక మహిషానికి జన్మించినవాడు మహిషుడు. బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేసిన మహిషుడు కామరూపధారణ, పురుషులతో మరణం లేనట్టి వరాన్ని పొందాడు. వరబలంతో గర్వితుడై ఇంద్రాది దేవతలను, త్రిమూర్తులను జయించాడు. దేవతలను బాధించడం ఆరంభించాడు. మహిషుడి దుర్మార్గాల నుంచి తమను రక్షించాల్సిందిగా దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు బాగా ఆలోచించి.. ‘వరాల కారణంగా మహిషుడిని వధించడం అసాధ్యం కాబట్టి, అందరం కలిసి ఆదిశక్తిని ప్రార్థిద్దామ’ని సూచించాడు. తదనుగుణంగా అందరూ సమష్టిగా ఆదిశక్తిని ప్రార్థించగా దేవతలందరి సమష్టి శక్తిగా అమ్మవారు పద్దెనిమిది భుజాలతో వివిధ ఆయుధాలతో, సింహవాహినియై వారికి ప్రత్యక్షమైంది. అమ్మవారి అపూర్వ సౌందర్యాన్ని చూసిన మహిషుడు మోహితుడై తనను వివాహం చేసుకోవాలని కోరగా.. దానిని తిరస్కరించిన దుర్గాదేవి అతనితో యుద్ధం చేసి చివరికి సంహరించింది.
జీవకోటికి సహజమైనది భయం. మరణభయం అన్నిటికన్నా ఎక్కువగా వేధిస్తుంది. దానిని అధిగమించాలని అనాదిగా మానవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాగే కామన (ఇచ్ఛ) కూడా అత్యంత సహజమైనది.
మహిషుడు కామనకు ప్రతీక. ఏ జంతువులైనా మొక్కలను ఆహారంగా తీసుకునే సమయంలో మొక్కలు పారిపోవు.. కాని జంతువులు మరొక బలమైన జంతువు బారినుంచి తప్పించుకునేందుకు తమకు తాముగా ప్రయత్నిస్తాయే కాని, ఇతరుల సాయం కోసం ఎదురుచూడవు. మానవులు మాత్రం బయటినుంచి రక్షణను కోరుకుంటుంటారు. ఆ రక్షణ కోసమే దుర్గాలను నిర్మించుకున్నాడు.. ఆ దుర్గాలే దుర్గాదేవి. అయితే దుర్గ వేరు, శక్తి వేరు. మనందరి అంతరంగంలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సమస్యలను సాధారణంగా మనమే అధిగమించగలం. అయినా పరుల సాయం కోసం వెంపర్లాడుతాం. దుర్గ అనేది బాహ్యమైన శక్తిసామర్థ్యాలకు, సాంకేతిక పరికరాలకు, సంపదకు, ఆస్తిపాస్తులకు, సమాజంలో తన స్థాయికి, రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. దానిని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తుంటాం. శక్తి అంతర్గతమైనది. సమస్యలను అధిగమించే నైపుణ్యాలకు సంబంధించింది. ప్రతిభకు, ప్రజ్ఞకు సంబంధించింది. నిజానికి మానవ జీవన సాధనాపర్వంలో ఈ రెండూ కావాల్సినవే.
నిజానికి శక్తి ఒకరిస్తే వచ్చేది కాదు. తపనతో దానిని మనకు మనంగా జాగృతం చేసుకోవాలి. దుర్గాదేవి రక్షణ కావాలనుకోవడం మనలోని అంతర్గత శక్తిసామర్థ్యాలను గుర్తించకపోవడమే. ఆ ప్రక్రియలో గురువు లేదా మార్గదర్శకుడు ఉత్ప్రేరకంగా పనిచేస్తాడు. సాధించాలనే అమితమైన కోరిక తపనతో జతకడితే.. జాగృతమైన అంతర్ చేతనలోని శక్తి.. విజయానికి మార్గం చూపుతుంది.
ఇక్కడ మహిషుడిని ఎదుర్కొనడానికి విష్ణువు సూచించిన మార్గం ప్రతి వ్యక్తిలోని అంతర్గత శక్తిని జాగృతం చేయడం! అందరి సమష్టి శక్తిసామర్థ్యాలు ఒక ఆకృతిని పొంది దుర్గా‘మహాశక్తి’గా అవతరించాయి. కార్యసాధనలో ఆమె అవతరించడం కొత్త ఆవిష్కరణలు కాగా, ఆమె ధరించిన ఆయుధాలు సాంకేతిక నైపుణ్యాలు. సమష్టిగా నిలవడం సామాజిక నిర్మాణంగా భావిస్తే… అఖండమైన శక్తి సామర్థ్యాలు మనలో సుప్తావస్థలో ఉన్నాయని.. వాటిని జాగృతం చేసుకోగలిగితే.. ఎంతటి ‘దుర్గమ’మైన కార్యాన్ని అయినా సాధించగలమని అర్థం చేసుకోవచ్చు. ఆమె అధిరోహించిన సింహం.. మనందరిలో ఉన్న పశుప్రవృత్తికి ప్రతీక. ఇతరులను ఆక్రమించాలని, మన పరిధులను విస్తరించుకోవాలని, ‘నేనే’ అనే భావనను అందరూ గుర్తించాలనే తపనకు మూలం ఆ పశుప్రవృత్తే!!
ఒక సంస్థలోని నాయకుడు తన సంస్థ అభ్యుదయ మార్గంలో నడవాలని తన సంస్థలోని ఉద్యోగులందరూ సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా పరిపూర్ణతను సాధించాలని కోరుకుంటాడు. తన ఆశయం సాకారం కావాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలను ఏర్పరుచుకుంటాడు. ఆ నియమాలను అందరూ సమష్టి చైతన్యంతో పాటిస్తే.. సంస్థకూ, నాయకునికీ, ఉద్యోగులకు దుర్గ అంటే రక్షణ లభిస్తుంది. అలాంటి రక్షణ మనందరికీ లభించాలని.. ఆ దుర్గామాతను వేడుకుందాం.
…? పాలకుర్తి రామమూర్తి